మీడియాని అడ్డుకోవద్దు.. అనేక అనుమానాలకు దారి తీస్తుంది
posted on Jul 24, 2020 6:51PM

సచివాలయం కూల్చివేతల వద్దకు మీడియాకు అనుమతి ఇవ్వలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేతపై కవరేజ్ కు మీడియాను అనుమతించాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారించింది. కోవిడ్ బులిటెన్ మాదిరిగా కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ విడుదల చేస్తామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. అయితే, తమకు ప్రత్యక్ష ప్రసారాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఆర్టికల్ 90 ప్రకారం మీడియా స్వేచ్చకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని పిటిషనర్ అన్నారు.
నిర్ధిష్ట సమయంలో కనీసం అరగంట అయినా మీడియాను అనుమతించ లేరా? అని హైకోర్టు ప్రశ్నించింది. అందరూ ఒకేసారి రావటంతో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తారని, జర్నలిస్టులను అనుమతిస్తే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం వాదించింది.
కనీసం సచివాలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి కూల్చివేతలను కవరేజ్ చేస్తున్నా అడ్డుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకరాగా.. ప్రైవేటు ప్రాంతాల్లో వెళ్లి కవరేజ్ చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియా అడ్డుకోవద్దని ఆదేశించింది.
నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో ప్రసారం అయిందని, అది నిజమో కాదో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యంగా పనులు చేపడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించి కోట్ల రూపాయల సంపదను లైవ్‌లో చూపించిన మీడియాను, ఇప్పుడు ఎందుకు మీరు కట్టడి చేస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం మీడియాకు అనుమతిస్తుందని అనుకున్నామని, అనుమతి ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రేపు పిటిషన్ అర్హతపై ప్రభుత్వం నిర్ణయం చూసి తుది తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.