జగన్ పై శేఖర్ గుప్తా తీవ్ర వ్యాఖ్యలు... కేంద్రం కల్పించుకోవాలని డిమాండ్...

ఏపీ రాజధాని వివాదంపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అమరావతి నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని... అలాగే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తేవడాన్ని పిచ్చి తుగ్లక్ చర్యగా ప్రముఖ పాత్రికేయుడు, ద ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా అభివర్ణించారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకోవడం జాతీయ విషాదమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ పిచ్చి చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అమరావతి నిర్మాణాన్ని కొనసాగించేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ సూచించాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ జగన్ స్థానంలో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఇలా చేసేవారు కాదని అన్నారు. చంద్రబాబు కలలుగన్న దానికంటే మరింత గొప్పగా అమరావతిని నిర్మించి ఉండేవారని శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు. 

మూడు రాజధానుల ఆలోచన ఆచరణీయం కాదన్న శేఖర్ గుప్తా....  అమరావతి నిర్మాణం దేశానికి ఎంతో అవసరమన్నారు. రాజకీయ పార్టీల మధ్య పోటీ శత్రుత్వంగా మారుతోందని, ఇది మంచిది కాదన్నారు. అలాగే, కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలు.... గత ప్రభుత్వాలు చేపట్టిన పనులను, కార్యక్రమాలను నిలిపివేస్తున్నాయని... ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేసి... ఒక స్థాయికి తెచ్చిన తర్వాత... దాన్ని నాశనం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

అయితే, ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. కేంద్రం వైఖరి కూడా ఇదేనని, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. అయితే, కేంద్ర పెద్దలు, బీజేపీ అగ్రనేతల నుంచి అమరావతికి అనుకూలంగా ప్రకటనలైతే రాలేదు. కానీ, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నదే బీజేపీ ఉద్దేశమంటూ రాష్ట్ర నేతలు అంటున్నారు.