సమ్మర్ కి ఇద్దాం షేక్ హ్యాండ్!!

వేసవికాలం వచ్చిందంటే వామ్మో అంటాము. మండిపోయే ఎండలు, మగ్గబెట్టే ఉక్కపోత, వీటికి తోడు కరెంట్ కోతలు. ఉదయం, సాయంత్రం తప్ప ఏ మధ్యాహ్నపు ఎండలోనో బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే గుండె గుభేలుమంటుంది. అందుకే ఎండ అంటే చెప్పలేనంత మంట అందరికీ. కానీ సమయం గడుస్తూ ఉంటే ఈ కాలాలు అదేనండి వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు ఎండాకాలం కూడా రాక తప్పదు. అది తన ప్రతాపం చూపించక తప్పదు. అయితే ఈ వేసవిని చూసి భయపడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, దీన్ని ఎంజాయ్ చేయడానికి అన్నే మార్గాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకుంటే సమ్మర్ మీద హమ్మర్ తో ఓ మోస్తరు సౌండ్ చేయచ్చు.


ఒకప్పుడు!!

సంవత్సరకాలం అంతా పిల్లలు ఎదురుచూసేరోజులు ఇవే అంటే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే వేసవి కోసం పిల్లలు అర్రులు చాచేవాళ్ళు. ఒక పూట బడి ముగియగానే ఎండను కూడా లెక్కచేయకుండా బావుల వెంట, చేల వెంట వెల్తూ ఎన్నో మధురస్మృతులను మూటగట్టుకునేవాళ్ళు. ఓ ముప్పై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళను పిలిచి బాల్యం గురించి చెప్పమంటే కళ్ళు మెరవడం, చిరునవ్వు బయటకు రావడం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.  అందుకే అన్ని కాలలను ఒకేలా పుస్తకాల మధ్య కాకుండా కాసింత ప్రత్యేకంగా గడిపేలా మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. అది వాళ్లకు ఆసక్తికరమై, వాళ్ళ సంతోషానికి కారణమయ్యేది అయ్యుండాలి సుమా!!


ప్రకృతి ఆతిథ్యం!!


నిజంగా నిజమే. వేసవిలో ప్రకృతి ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుందని. అవన్నీ చాలా వరకు ఇప్పటి తరానికి తెలియకుండా ఉన్నాయి. వాళ్లకు ఓసారి పరిచయం చేసి చూడండి. నాచురల్ లైఫ్ మీద లవ్ లో పడతారు వాళ్ళు.


పుల్లని విందు!!


బలే బలే పసందు ఈ పుల్లని విందు. అదే అదే ఫలాల రాజు మామిడి గారు ఎంతో ఠీవిగా చెట్లలో పెరిగి అందరినీ పలకరించడానికి ఇంటింటికి వస్తాడు. అందరి నోర్లు జలపాతాలు చేస్తాడు. 


చెరకు చరిష్మా!!


చిన్నప్పటి దంతాల రహస్యం. నోటితోనే చెరకు పొట్టు తీసి, కొరికి, కసకస నమిలి, రసాన్ని జుర్రుకుంటూ పిప్పిని పడేస్తే ఆహా ఉంటుంది ఆ నాలుగు అదృష్టం ఎంతో అనిపిస్తుంది. ఇప్పట్లో అంత సీన్లు లేకపోయినా ఎంచక్కా రోడ్ సైడ్ దొరికే చెరకు రసం తాగేసి హాయి హాయిగా వెళ్లిపోవచ్చు. 


ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇంకా చింతచిగురు వేరే లెవెల్. తాటి ముంజలు మరొక ఎత్తు, చల్ల చల్లటి మజ్జిగ, శరీర తాపాన్ని తగ్గించే పుదీనా శరబత్ ఇవన్నీ హైలైట్. 


అయితే మరొక మ్యాజిక్ కూడా ఉంది. అదే కేవలం రాయలసీమ ప్రాంతంలో లభ్యమయ్యే సుగంధి సిరప్. కేవలం కడప జిల్లాలో అడవులలో మాత్రమే పెరిగే సుగంధ మొక్కల వేర్లను ఉడికించి పంచదార కలిపి సిరప్ చేసి అమ్ముతుంటారు. సువాసన అద్భుతంగా ఉంటుంది. చల్లని నీళ్లు, లేదా షోడాతో ఈ సిరప్ కలిపి తీసుకుంటే వేసవి కాలం వెంట తీసుకొచ్చే వడదెబ్బ వంద కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తి పారిపోతుంది. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తుంది. 


వేసవి భయం అసలు వద్దు!!


ఎవరు ఎన్ని చెప్పుకున్నా బయటకు వెళ్ళేవాళ్లకు అదొక భయం. సర్రుమని కాలిపోతున్న రోడ్లన్నీ నరకంలో యమధర్మరాజు ఏర్పాటు చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందుకే సులువైన, మరియు అందరూ ఆచరించగల జాగ్రత్తలు.


బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మరి నీళ్లు అయిపోతే?? ఏముంది ఏకంగా బాటల్  కొనే పని తప్పుతుంది ఎక్కడో ఒక చోట అయిదు రూపాయల్లో బాటల్ నింపుకోవచ్చు. లేదు కాదు అంటే 20 నుండి 30 పెట్టి వాటర్ బాటిల్ కొనేబదులు ఎంచక్కా ఫ్రూట్ జ్యూస్, లేదా నిమ్మ షోడా వంటివి తాగడం హాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి ఇవి. ఇవి కాకుండా మరొక సలహా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కీరా దోస, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉన్నవి తినడం లేదా జ్యూస్ తాగడం మంచిది.


ఉప్పు, కారం, మసాలాలు వంటివి తగ్గించుకోవాలి ఈ కాలంలో. శరీర ఉష్ణోగ్రత మీద అవి ప్రభావం చూపిస్తాయి. 


వెంట గొడుగు ఉంచుకోవడం మర్చిపోకండి. లేదంటే టోపి, లేదా స్పార్క్ ఇలా ఎదో ఒకటి నెత్తిని కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి.


వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా చూసుకోవాలి. మధ్యలో సమయం అంతా ఇంటి పట్టున లేదా ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో ఉండటం మంచిది.

ఇలా చెప్పుకుంటూ పోతే వేసవి కోసం బోలెడు మార్గాలు. అయితే మనం ఎంత డాబు చెప్పుకున్నా ఈ ఎండల కొరడా దెబ్బకు ఒళ్ళు చురుక్కుమనడం సాధారణం. అందుకే దాని నుండి జాగ్రత్త మరి. జాగ్రత్తగా షేక్ హాండ్ ఇచ్చి కూల్ గా డీల్ చేసి పంపిద్దాం.

                                    ◆వెంకటేష్ పువ్వాడ.