పవిత్ర మాసం రంజాన్!!

పండుగ అంటే ఒక పెద్ద సంబరం. పండుగలో కళ ఉంటుంది, సంతోషం ఉంటుంది, వీటితో పాటూ ఒక గొప్ప సందేశం ఉంటుంది. అది హిందువులు అయినా, ముస్లింలు అయినా, క్రైస్తవులు అయినా పండుగ జరుపుకోవడం అంటే తాము నమ్మిన సిద్దాంతంలో ఉన్న సందేశాన్ని అందరికీ తెలియజేయడమే. ముస్లిం మతస్థులకు పండుగలు చాలా కొద్దిగా ఉంటాయి. వాటిలో ఎంతో ప్రాముఖ్యమైంది రంజాన్. ముస్లిం మతస్తులు అనుసరించే చంద్రమాస క్యాలెండర్ ప్రకారం వారి సంవత్సరంలో తొమ్మిదవ నెలే ఈ రంజాన్. ఇది ఎంతో పవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తారు. ఎందుకూ అంటే వారి పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ఈ రంజాన్ నెలలోనే ఆవిర్భవించింది.


పరమార్థం!!


ఒక వేడుకలో ఉండే అర్థాన్ని పరమార్థం అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పుకుంటున్న రంజాన్ కూడా అలాంటి పరమార్థాన్ని దాచుకున్నదే. ముఖ్యంగా రంజాన్ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అందులో ఉన్న విశిష్టతను చెబుతుంది. ఇక ఇందులో ముస్లిం మతం యావత్ ప్రాశస్త్యం ఇమిడిపోయి ఉంటుంది. 


ఉపవాసం ప్రాధాన్యత!!


హిందువులకు ఉపవాసం, మాఘమాసం, కార్తీకం, ఇంకా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఎంతటి భక్తి ఉంటుందో, రంజాన్ మాసంలో ముస్లిం మతస్థులకు అంతే భక్తి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. 


ప్రతిరోజు సూర్యోదయంకు ముందే నిద్రలేచి వంట చేసుకుని భోజనం చేసి సూర్యుడు ఉదయించి తరువాత ఇక పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠోర ఉపవాసదీక్ష చేపట్టడం వీళ్ళ భక్తికి, క్రమశిక్షణకు తార్కాణం. ఈ ఉపవాసాన్ని రోజా అని పిలుస్తారు. నెల మొత్తం నిష్ఠగా రోజా ఉండే వాళ్ళు చాలామందే ఉంటారు. వీళ్ళలో రోజూ ఖురాన్ గ్రంధాన్ని పఠించడం, విధిగా నమాజ్ చేయడం తప్పనిసరిగా చేస్తారు. 


ఇఫ్తార్!!


ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ గా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో ఇఫ్తార్ విందులు చాలా ఫెమస్ అయిపోయాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఓ రేంజ్ లో ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా ఖర్జూరానికి స్థానమిచ్చారు. ఉపవాసం ముగియగానే మొదటగా ఖర్జూరం తిన్న తరువాత మిగిలిన ఆహారం తీసుకుంటారు. అయితే సాధారణ రోజా ఉండేవాళ్ళు ఉపవాస దీక్ష ముగియగానే తాము తెచ్చిన ఆహారాన్ని అందరికీ పంచుతారు. ఇలా ఒకరికి ఇవ్వడంలో గొప్పదనాన్ని తమ మతంతో చాటి చెబుతారు.


జకాత్!!


ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంతమొత్తాన్ని దానధర్మాల కోసం ఉపయోగించాలి. జాకాత్ అందుకే ఉద్దేశించబడింది. ఇవ్వడం అంటే ఇవ్వాలి కాబట్టి తమవారికి ఇచ్చుకోవడం కాదు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యడం. ముఖ్యంగా పండుగ జరుపుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు అవసరమైనవి సమకూర్చడం. ఇలా పండుగలో ఇవ్వడమనే గొప్ప విషయాన్ని మేళవించారు.


పవిత్ర ఖురాన్!!


హిందువులకు భగవద్గీత ఎలాంటిదో ముస్లిం మతస్తులకు ఖురాన్ అలాంటిది. నిజానికి ఖురాన్ లో ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే ప్రతి మాత గ్రంధం కాలానుగుణంగా మారే మతపెద్దలు ఆలోచనలను నింపుకుంటూ మెల్లిగా స్వరూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. అలా అవి మారుతూ ఉండటం వల్లనే ప్రస్తుతం అన్నిరకాల మత గ్రంధాలు విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాయి. అందుకే ఎందులో అయినా మంచిని తీసుకోవడంకు మించిన గొప్ప పని మరొకటి ఉండదు.


నెలవంక నియమం.


ప్రతిరోజూ ఆకాశంలో నెలవంకను చూసి దాని ప్రకారం ఉపవాస దీక్షను అంచనా వేసుకోవడం వీరి ప్రత్యేకత. హిందువులు ఎలాగైతే సూర్యుడి ఉషోదయ, అస్తమయాలను లెక్కలోకి తీసుకుంటారో, వీళ్ళు అలాగే చంద్రుడిని తీసుకుంటారు. 


ఇలా నియమాలు, దానధర్మాలు, సహాయాలు కలగలిసి ఎంతో ఉదార హృదయాలను, ఉపవాస దీక్షలతో సహనాన్ని, నమాజ్ లతో క్రమశిక్షణను పెంచే రంజాన్ అందరికీ సందేశాన్ని ఇచ్చే పండుగ.


                                  ◆ వెంకటేష్ పువ్వాడ.