ఈవీఎంలపై ఆరోపణలు చేశారు! ఈసీ చేతిలో ఓడిపోయారు!

EVM… ఈ పేరు చెబితే చాలు ఆ మధ్య అరవింద్ కేజ్రీవాల్ మొదలు మాయావతి దాకా అందరూ చిటపటలాడిపోయారు! వాట్ని  ట్యాంపర్ చేయటం వల్లే మోదీ బీజేపిని గెలిపించుకుంటూపోతున్నారని విమర్శలు గుప్పించారు! యూపీలో, ఉత్తరాఖండ్ లో ఈవీఎంల చలువ వల్లే కాషాయ దళం భారీ గెలుపు సాధించింది అన్నారు! ఇక ఆ తరువాత అదే సాకుని దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి కూడా వాడేసుకున్నాడు కేజ్రీవాల్! ఈవీఎంలు హ్యాక్ కాకపోయి వుంటే తమ సత్తా తెలిసేదంటూ స్టేట్మెంట్ విసిరాడు!

 

కేజ్రీవాల్, మాయావతి , కాంగ్రెస్ నాయకుల ఈవీఎం విమర్శలకు ప్రధాని ఎక్కడా యాన్సర్ ఇవ్వలేదు. కాని, ఈవీఎంల నిర్వహణ బాధ్యత చూసుకునే ఈసీ మాత్రం పిచ్చి పిచ్చి రాజకీయ ఆరోపణల్ని సీరియస్ గా తీసుకుంది! దమ్ముంటే ఏ పార్టీ అయినా ముందుకొచ్చి ఈవీఎంలు హ్యాక్ చేయాలంటూ సవాలు విసిరింది. అధికారికంగా ఎన్నికల కమీషన్ అన్ని పార్టీలకు లెటర్ లు కూడా పంపింది!

 

దారుణమైన ఓటమి నుంచి నిజమైన గుణపాఠం నేర్చుకోకుండా ఈవీఎం సాకు చెబుదామనుకున్న పార్టీలకు, నేతలకు ఈసీ ఇచ్చిన షాక్ బగా ఇబ్బంది పెట్టింది. ఒక్కొక్క పార్టీ ఛాలెంజ్ నుంచి తప్పుకోవటం మొదలెట్టింది. కాంగ్రెస్ అయితే… ఈవీఎంలను ఎన్నికల్లో వాడటం మొదలు పెట్టిందే మా పార్టీ… మేం ఎలా వాట్ని శంకిస్తాం అంటూ మాట మార్చేసింది!

 

కేవలం ఎన్సీపీ, సీపీఐ పార్టీలు మినహా దేశంలోని ఏ పార్టీ కూడా ఈసీ ఆహ్వానించిన ఈవీఎం ట్యాంపరింగ్ ఛాలెంజ్ కి ముందుకు పోలేదు. కారణం భారతీయ ఎన్నికల కమీషన్ తీసుకునే జాగ్రత్తల అనంతరం ఈవీఎంలను ట్యాంపర్ చేయటం దాదాపు అసాధ్యం. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యే తీసుకొచ్చిన తన స్వంత ఈవీఎం మిషన్ హ్యాక్ చేయించినంత ఈజీ కాదు! ఈ విషయం తెలుసు కాబట్టే అందరి కంటే ఎక్కువ రొద చేసిన కేజ్రీ కూడా సైలెంట్ గా సైడ్ అయిపోయాడు ఛాలెంజ్ నుంచీ! పైగా ఈసీపైనే నెపం నెట్టడానికి తనకు అలవాటైన రీతిలో ఒక విచిత్రమైన ఆరోపణ చేశాడు!

 

ఈసీ హ్యాక్ చేసేందుకు ఏర్పాటు చేసే ఛాలెంజ్ లో మదర్ బోర్డ్ కూడా ఆప్ వారికి అందుబాటులో వుంచాలట! అంటే ఏకంగా మదర్ బోర్డ్ లోని కనెక్షన్సే కరప్ట్ చేసి హ్యాక్ చేస్తారన్నమాట! అలా చే్స్తే మొత్తానికి మొత్తంగా ఈవీఎం మిషన్నే మార్చేసినట్టు అవుతుందని అంటున్నారు ఈసీ అధికారులు! ఇక ఎలాగూ ఈసీ ఎలాగూ మదర్ బోర్డ్ ముట్టుకోనివ్వదు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ సేఫ్ అన్నమాట!

 

అసలు ఒకే సారి ఎన్నికలు జరిగిన సమయంలో… యూపీ, ఉత్తరాఖండ్ లలో ట్యాంపర్ చేసిన గెలిచిన బీజేపి గోవా, మణిపూర్ లలో మెజార్జీ కంటే తక్కువ సీట్లు ఎందుకు తెచ్చుకుంటుంది? పంజాబ్ లో అయితే దారుణంగా ఎందుకు ఓడిపోతుంది? కాంగ్రెస్ నుంచీ కేజ్రీవాల్ వరకూ అందరూ ఈ ప్రశ్నలు తమకు తాము వేసుకోవాలి! ఈవీఎంలు హ్యాకయ్యాయని అనుమానించే ముందు తమ వ్యూహాలు ఎక్కడ హ్యాకైపోయాయో గుర్తించి మోదీని, బీజేపిని ఢీకొట్టే ప్రయత్నం చేయాలి! లేదంటే ఇలాంటి ఈవీఎం హ్యాకింగ్ ఛాలెంజ్ లాంటి అవమానాలే ఎదురవుతాయి. ప్రజల ముందు గతంలో చేసిన ఆరోపణలన్నీ ఒట్టివేనని తేలిపోతుంది!