గంటాను టార్గెట్ చేసిన సర్కార్.. 24 గంటలే డెడ్ లైన్!!

 

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. విపక్ష నేతలకు చెందిన భవనాలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపులకు దిగుతుందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయినా వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదంటుంది.

ఇప్పటికే నెల్లూరు స్థానిక టీడీపీ నేతల భవనాల్ని, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. తాజాగా మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చారు. గంటాకు చెందిన భీమిలిలోని క్యాంపు కార్యాలయ భవనాన్ని కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం అయినందున 24 గంటల్లో కూల్చేస్తామని పేర్కొంటూ గురువారం సాయంత్రం గంటాకు నోటీసులు జారీచేశారు. అయితే భవనం క్రమబద్ధీకరణకు ద రఖాస్తు చేసుకున్నప్పటికీ రాజకీయ కక్షతోనే దానిని తిరస్కరించి, భవనం కూల్చివేయాలనే నిర్ణయానికి వచ్చారని గంటా ఆరోపిస్తున్నారు. 

భీమిలిలో గల టౌన్‌ సర్వేనంబర్‌ 442లో గంటా కుమార్తె సాయిపూజిత పేరుతో నిర్మించిన భవనాన్ని ఆయన క్యాంప్‌ కార్యాలయంగా వాడుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ భవనానికి ఎలాంటి ప్లాన్‌ లేనందున చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీచేశారు. గంటా దీనిపై హైకోర్టును ఆశ్రయించారు.
 
దీనిపై కోర్టు ఇటీవల జీవీఎంసీ అధికారుల వివరణ కోరగా.. అక్రమ భవన నిర్మాణం కావడంతో చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. భవనం కూల్చేముందు యజమానికి ఐదు రోజులు ముందు సమాచారం ఇవ్వాలని సూచించింది. అందులో వున్న ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించింది. 

అయితే జీవీఎంసీ అధికారులు భవనాన్ని 24 గంటల్లో కూల్చివేస్తున్నట్టు పేర్కొంటూ గురువారం గంటాకు నోటీసులు అందజేశారు. బీపీఎస్ లో భవనం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాజకీయ కక్షతోనే తన భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారని గంటా ఆరోపించారు. ఒకవేళ భవనాన్ని కూల్చివేయాలనుకుంటే ఐదు రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని కోర్టు సూచించినా అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.