కమలం గూటికి గువ్వల బాలరాజు.. సీనియర్ల సమక్షంలో పార్టీ కండువా!
posted on Aug 9, 2025 9:39AM

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మూడు రోజుల వ్యవధిలోనే కమలం కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజు.. బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నంత కాలం పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అత్యంత సన్ని హితుడిగా గుర్తింపు పొందారు. అయితే పార్టీ పరాజయం తరువాత నుంచీ ఆయన పార్టీ నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదనీ, అచ్చంపేట నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా పార్టీ అధినాయకత్వం తన ప్రాధాన్యతను తగ్గించేస్తున్నదనీ ఆయన ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా గువ్వల బాలరాజు పార్టీ వ్యవహారాలలో, కార్యక్రమాలలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల కిందట పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శుక్రవారం (ఆగస్టు 8) మీడియా సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను స్వార్థపరుడిగా అభివర్ణించారు. అంతే కాకుండా శుక్రవారం నాడే ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాను కమలం కండువా కప్పుకోవడం, తన రాజకీయ భవిష్యత్ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో పలుమార్లు చర్చించి, నియోజకకవర్గ ప్రజల అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకుని కమలం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు గువ్వల బాలరాజు చెప్పారు. బీజేసీ సీనియర్ నాయకుల సమక్షంలో శనివారం (ఆగస్టు 9) కమలం గూటికి చేరనున్నట్లు తెలిపారు. కాగా గువ్వల బాలరాజు చేరికతో నాగర్ కర్నూల్ జిల్లాలో బీజేపీ ఒకింత బలపడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.