శ్రావణ శుక్రవారం రోజు చంద్రబాబుతో వరలక్ష్మి భేటీ
posted on Aug 9, 2025 9:08AM

చంద్రబాబుపై అభిమానంతో.. ఆయన సీఎం కావాలన్న బలమైన ఆకాంక్షతో 108 దేవాలయాలలో సంగీత కచ్చేరీలు చేసిన వరలక్ష్మి శుక్రవారం (ఆగస్టు 8) ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు సీఎం అయితే 108 దేవాలయాల్లో సంకీర్తనా గానం చేస్తానని మొక్కుకున్న సంగతినీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ మొక్కుతీర్చుకున్న విధానాన్ని వివరించారు.
మంగళగిరిలో జన్మించిన వరలక్ష్మి ముంబైలో స్థిరపడినా.. జన్మభూమి పట్ల మమకారాన్ని వదులు కోని వరలక్ష్మి.. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతమై.. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం అయ్యి తీరాలని భావించారు. స్వతహాగా గాయని అయిన వరలక్ష్మి చంద్రబాబు సీఎం అయితే.. 108 దేవాలయాల్లో సంగీత కచ్చేరీలు చేస్తానని మొక్కుకున్నారు. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె ఆ మొక్కుతీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని వివిధ ప్రసిద్ధ దేవాలయాలలో ఆమె సంగీత కచ్చేరీలు చేసి ఆ మొక్కును తీర్చుకున్నారు. అన్నవరం సత్యన్నారాయణ స్వామి దేవాలయంలో తొలి కచ్చేరీ చేసిన ఆమె.. తన 108వ కచ్చేరీని బెజవాడ దుర్గమ్మ ఆలయంలో చేశారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆమె తన కచ్చేరీలకు సంబంధించిన వివరాలను రాసుకున్న పుస్తకాన్ని చంద్రబాబుకు చూపారు. దానిని పరిశీలించిన ఆయన ఆ పుస్తకంపై సంతకం చేశారు. తన పట్ల వరలక్ష్మి చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం కోసం, తన కోసం దేవుళ్లను ప్రార్ధించడం వల్లే ప్రజల అభిమానానికి, కార్యకర్తల కష్టానికి దైవ కృప తోడైందని చంద్రబాబు అన్నారు. వరలక్ష్మీ లాంటి అభిమానులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తానని అన్నారు.