బీఆర్ఎస్ గాలి తీసేసిన గుత్తా ఆయనా ‘చే’యందుకుంటున్నారా?

బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత  కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు. తాజాగా శాశనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ నుంచి వలసలపై చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటమి పరాభవాన్ని దిగమింగుకుని పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే లోక్ సభ ఎన్నికలలో సత్తాచాటడమే మార్గమని భావించి సర్వశక్తులూ కూడగట్టుకుని లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర ద్వారా కేసీఆర్  శ్రీకారం చుట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్న వేళ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాశనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి.

తలెత్తుకోలేనంతగా పార్టీ అధిష్ఠానం పరువును గంగలో కలిపేశాయి. ఇంతకీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారంటే పార్టీ నుంచి వలసలకు   పార్టీ నాయకత్వంపై నేతలు విశ్వాసం కోల్పోవడమే కారణమని కుండబద్దలు కొట్టేశారు. శనివారం (ఏప్రిల్ 19) విలేకరులతో మాట్లాడిన ఆయన పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలు కావడానికి పార్టీ హైకమాండ్ తో పాటు మంత్రుల వ్యవహారశైలి కూడా కారణమన్నారు. అహంకారం తలకెత్తినందునే పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇప్పటికి కూడా పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవడానికి పార్టీ అగ్రనాయకత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ తీరు మారకుంటే భవిష్యత్ లో  పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పారు. 

అంతే కాదు.. నాడు తాను బీఆర్ఎస్ లో చేరడానికి కారణాలను కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నాడు తనను 16 సార్లు కలిసి బతిమలాడితే తాను పార్టీ మారాననీ, కేబినెట్ లోనికి తీసుకుంటామన్న హామీ ఇచ్చిన తరువాతే కారెక్కాననీ వివరించారు. ఆ తరువాత పరిస్థితి మారిపోయిందనీ, గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎవరికీ అప్పాయింట్ మెంటే ఇవ్వలేదనీ అన్నారు, 

పార్టీని అడ్డుపెట్టుకుని ఉద్యమ కారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించారనీ, ఒక నాడు జేబులో వందల రూపాయలు కూడా లేని వ్యక్తులు ఈ రోజు కోట్లకు పడగలెత్తారంటే ఏ రీతిన సంపాదనకు మరిగారో అర్ధం చేసుకోవచ్చన్నారు. తన కుమారుడు అమిత్ పోటీకి వెనుకడుగు వేయడానికి పార్టీలోని కొందరు సహకరించకపోవడమే కారణమన్నారు. ఇక ఇటీవలి కాలంలో పార్టీ మారిన బీఆర్ఎస్ సిట్టుంగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుత్తా శుఖేందర్ రెడ్డి చెప్పారు.  గుత్తా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కూడా కారు దిగడానికి నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఆయన కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ మారుతున్నాననే సంకేతాలను ఆయన నేరుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ మాట్లాడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి వలసలు ఆ పార్టీని గాభరాపెడుతున్నాయి. పార్టీ నుంచి వలసల  నిరోధం విషయంలో పార్టీ హైకమాండ్ చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.