జ్ఞానాన్ని గుభాళింపజేసే గురుపూర్ణిమ!

ఆషాడ శుద్ద పౌర్ణమి రోజును గురుపౌర్ణిమ అని కూడా అంటారు. గురుపూర్ణిమ అనేది గురువును స్మరించుకుంటూ జరుపుకునే వేడుక అని అందరి అభిప్రాయం. గురుపూర్ణిమ రోజునే వ్యాసుడు జన్మించాడు కాబట్టి దీన్ని వ్యాసపూర్ణిమ అంటారని కొందరు చెబుతారు. ఏది ఏమైనా ఆషాడ శుద్ధ పూర్ణిమ రోజును అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. 

గురువును పూజించడం భారతీయ సనాతన ధర్మంలో ఎప్పటి నుండో ఉంది. భక్తుడు లేదా శిష్యుడిలో ఉన్న అంధకారాన్ని తొలగించేవాడు గురువు. మన భారతదేశంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారం పొంది ప్రజలకు ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రశాంత జీవితాన్ని గురించి తమ భోధనల ద్వారా చెప్పినవాళ్ళు. ఇంకా ముఖ్యంగా తమ జీవితం ద్వారానే ప్రజలకు, శిష్యులకు గొప్ప మార్గాన్ని చూపినవాళ్ళు. బుద్ధుని జీవితాన్ని ప్రజలకు ఎలా అయితే ఒక గొప్ప మార్గంగా ప్రచారం చేస్తారో, బుద్ధ పూర్ణిమను ఎంతో ప్రత్యేకంగా ఎలా చూస్తోరో, అలాగే గురుపూర్ణిమ కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

గురుపూర్ణిమ రోజున ఎంతో మంది తమ గురువుల అనుగ్రహం కోసం గురువును ఆశ్రయిస్తారు. కొందరు ఉపదేశాలు తీసుకుంటారు. మరికొందరు గురువుకు సేవ చేసుకుంటారు, గురువును గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. షిరిడి సాయి బాబా లాంటి గురువుల మందిరాలు భక్తులతో కిటకిటలాడుతాయి.

గురుపూర్ణిమ వెనుక కథనం!!

అందరూ గురుపూర్ణిమ వెనుక కథ ఏంటి అంటే వ్యాసుడు జన్మించాడు కాబట్టి గురుపూర్ణిమ జరుపుకుంటారు అని చెబుతారు. కానీ వ్యాసుడు జన్మించడం  నిజమే అయినా దానికంటే అరుదైన విశిష్టమైన కథనం గురుపూర్ణిమ వెనుక ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురుపూర్ణిమ వెనుక ఆసక్తికర కథనాన్ని చెప్పారు.

ఆయన ఆరాధించే పరమేశ్వరుడు ఆదియోగి. ఆయనే ఈ సృష్టిలో మొదటి యోగి అని ఆయనే మొదటి గురువు అని సద్గురు చెబుతారు. ఈ సృష్టిలో మొట్టమొదటిసారి ఒక యోగి హిమాలయాల్లో కనిపించాడు ఆయన్ను చూసిన ప్రజలు ఆయన ఏమైనా చెబుతాడేమో ఎదురుచూసారు కానీ ఏమీ చెప్పకపోవడం వల్ల అందరూ వెళ్లిపోయారు. అయితే అక్కడ ఏడుమంది మాత్రం అలాగే ఉండిపోయారు. ఆదియోగి వాళ్ళను పట్టించుకోలేదు. కానీ వాళ్ళు అక్కడి నుండి వెళ్లకుండా సుమారు 84 సంవత్సరాలు అక్కడే ఉన్నారట. చివరికి ఆదియోగి వాళ్ళవైపు చూసినప్పుడు సరిగ్గా దక్షిణాయనం మొదలైందట. ఆదియోగి ఆ ఏడుమందికి గురువుగా మారి ఉపదేశం చేశారు. ఆ ఏడుమంది సప్తర్షులుగా పిలవబడ్డారు. అంతేకాదు ఆదియోగి ఆ సప్తర్షులవైపు దక్షిణదిక్కుగా చూసాడు కాబట్టి ఆయన దక్షిణామూర్తిగా పిలబడ్డాడు. ఆదియోగి సప్తర్షులకు గురువుగా మారి చేసిన ఉపదేశాన్ని సప్తర్షులు ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. ఇదీ గురుపూర్ణిమ వెనుక కథనం.

అయితే గురువు ఎవరైనా శిష్యుడికి ఎంతో గొప్పవాడు కాబట్టి ఎందరో గురువులున్న ఈ భారతదేశంలో తమ తమ గురువును తలచుకుంటూ, పూజిస్తూ, సేవిస్తూ గురుపూర్ణిమను చాలా భక్తితో జరుపుకుంటారు. కాబట్టి అందరికీ గురువు అనుగ్రహం ఉండాలని కోరుకుందాం. ఈ గురుపూర్ణిమ నాడు అందరూ గురువులూ తమ శిష్యులకు గొప్ప జ్ఞానాన్ని పంచాలని ఆశిద్దాం.

                                  ◆ వెంకటేష్ పువ్వాడ.