మగాడికి వితంతు పెన్షన్..

దేశంలో ప్రస్తుతం పాలనంతా సంక్షేమ పథకాల చుట్టే సాగుతోంది. కేంద్ర సర్కార్ కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొంతంగా మరికొన్ని రూపొందించాయి. వృద్దాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు ఇస్తున్నాయి. అయితే అందించే సాయం మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం భారీగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. తెలంగాణ సర్కార్ ఆసరా పేరుతో పెన్షన్లు ఇస్తుండగా.. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద అర్హులైన వారికి నెలనెలా పలు సామాజిక పెన్షన్లను అందజేస్తోంది. ఇందులో వితంతు పెన్షన్ల కూడా ఉన్నాయి. భర్త చనిపోయి ఒంటరైన మహిళలకు ఈ ప్రభుత్వం ఈ పెన్షన్ అందిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. అర్హులకు ఇవ్వకుండా.. తమకు కావాల్సిన వారికి అర్ఙత లేకపోయినా అధికార పార్టీ నేతలు పెన్షన్ ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన మాత్రం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.  ఓ గ్రామంలో పురుషుడికి వితంతు పింఛన్ వస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన వాలంటీర్లు కూడా దీనిని గుర్తించలేదు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామానికి చెందిన ఖాశీం అనే వ్యక్తికి వితంతు పెన్షన్ వస్తోంది, అతడి పెన్షన్ ఐడీ 113529781. ప్రతి నెలనెల అతను పెన్షన్ తీసుకుంటున్నాడు. అధికారులు గుర్తించడంతో ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు పురుషుడికి వితంతు పెన్షన్ ఎలా మంజూరైందనేది ఎవరికీ అర్ధంకావడం లేదు.

కాశీ కొంతకాలం క్రితం తన స్వగ్రామం నుంచి గుంటూరు జిల్లాకు వలసవెళ్లారు. వినుకొండ మండలం చిట్టాపురంలో ఉంటున్నారు. ఈ క్రమంలో చిట్టాపురం గ్రామ సచివాలయంలోని వెల్ ఫేర్ అసిస్టెంట్ వద్దకు పెన్షన్ తీసుకునేందుకు ఈనెల 4న వెళ్లారు. ఐతే పెన్షన్ కార్డు చూసి వితంతు పెన్షన్ ఎలా వస్తుందని ప్రశ్నించడంతో కాశీం సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు కాశీ స్వగ్రామమైన డోన్ మండలం ఎద్దుపెంట మండల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి అదికారులు పొరబాటును గుర్తించి విచారణ చేపడతామని తెలిపారు.పెన్షన్ మంజూరు చేసిందెవరు అనేది చర్చనీయాంశమైంది. ఇలాంటి పెన్షన్ ఇదొక్కటేనా.. ఇంకా ఎమైనా ఉన్నాయా..? అనేది అధికారులు విచారణ చేపట్టారు. ఒక పురుషుడికి వితంతు పెన్షన్ మంజూరవడమే విడ్డూరంగా ఉంది. ఇది ఎవరైనా కావాలని చేశారా...? లేక పొరబాటున మంజూరు చేశారా అనేది సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.