మాచర్లలో కోట్లు ఖర్చుపెట్టేదెవరు?
posted on Mar 30, 2012 10:43AM
గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వారికే టిక్కెట్ ఇచ్చే యోచనలో తెలుగుదేశంపార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. మాచర్ల టిక్కెట్ ను మండవ రవి, మదార్ సాహెబ్, డాక్టర్ నెల్లూరు పార్వతయ్య, కొమ్మారెడ్డి చలమారెడ్డి, మానుకొండ సాంబిరెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి, రిటైర్డ్ ఐజి చిరుమామిళ్ళ వెంకటనరసయ్య, నిమ్మగడ్డ దుర్గాశ్రీనివాస్ తదితరులు ఆశిస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో అభ్యర్థి ఎంపిక విషయమై చంద్రబాబునాయుడు ఇటీవల మంతనాలు జరిపారు.
ఎన్నికల వ్యయాన్ని పార్టీ భరించే స్థితిలో లేదని, ఏ అభ్యర్థి ఎక్కువ ఖర్చుపెడితే వారికే టిక్కెట్ ఇద్దామన్న ఆలోచనను చంద్రబాబునాయుడు ఆ సమావేశంలో తేవడంతో సీనియర్ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు సీనియర్లు అభ్యర్థులతో మాట్లాడి ఎవరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో తెలుసుకున్నారు. చిరుమామిళ్ళ వెంకటనరసయ్య రూ. 12కోట్లు, నిమ్మగడ్డ దుర్గాప్రసాద్ రూ. 10కోట్లు, మండవ రవి రూ. 5కోట్లు, చలమారెడ్డి రూ. 4కోట్లు, డాక్టర్ పార్వతయ్య రూ. 3కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా వున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ టిక్కెట్ ఎవరికీ ఇచ్చినా మిగిలిన వారు అతని విజయానికి సహకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.