చీడపురుగులా తయారైన సబ్బంహరి
posted on Mar 30, 2012 10:36AM
అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బంహరిపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక చీడపురుగులా తయారయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జండాను భుజానవేసుకుని తిరుగుతున్న సబ్బంహరి సిగ్గూ శరం ఉంటే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటుచేసి సబ్బంహరికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. ఇటీవల చీడికాడ మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఒక తీర్మానం ఆమోదిస్తూ తమ ప్రాంతంలో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ ఎంపిగా సబ్బంహరిని గెలిపించుకున్నామని, అయితే అతను రాజకీయ వ్యభిచారిగా మారిపోయాడంటూ విమర్శలు కురిపించారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు అసలు నమ్మరని, మోసం చేసిన వ్యక్తిని పార్టీనుంచి బహిష్కరించాలని వారు ఆ తీర్మానంలో కోరారు. కార్యకర్తలు, నాయకుల నుంచి ప్రతిఘటనలు వస్తుండటంతో సబ్బంహరి తన నియోజకవర్గంలో పర్యటించడం మానేశారు. ఉంటే వైజాగ్ లేదా ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సబ్బంహరి బాహాటంగానే సమర్థిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కార్యకర్తలకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది.