కొంచెం ఇష్టం .. కొంచెం కష్టం!

స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ.. వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే,    బుధవారం(సెప్టెంబర్ 3) జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో అందుకు సంబదించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలపై భారాన్ని తగ్గించే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.  ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న 12, 28శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌ రేట్లు అమలులోకి వస్తాయి.

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడారు. నెక్ట్స్‌ జనరేషన్‌ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు.  రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలను  దృష్టిలో ఉంచుకొని జీఎస్టీలో రెండు స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జీఎస్టీ ఫైలింగ్‌ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు.  కొత్త స్లాబ్‌లతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న ఆమె..  చాలా ఆహార పదార్థాలపై జీరో పర్సంట్ జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. అన్ని టీవీలపై 18శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ సహా పలు  రాజకీయ పార్టీలు జీఎస్టీ సంస్కరణలకు స్వాగతం పలికారు.  జీఎస్టీ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తుందని  ప్రధాని పేర్కొంటే, జీఎస్టీ సంస్కరణలు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనకరమనీ, జీఎస్టీ తగ్గింపు పేదలకు అనుకూలమైన, వృద్ధి ఆధారిత నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయం ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన నాణ్యతను ఇస్తుందనిచంద్రబాబు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు.  ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పవన్ కళ్యాణ్  కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి పార్టీల నాయకులు మాత్రం.. కొంచెం ఇష్టం, కొంచం కష్టం అన్నట్లుగా  స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, చిదంబరం జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే, చిన్న మెలిక పెట్టారు. 

ప్రస్తుత జీఎస్టీ చట్టంలో లోపాలున్నాయని ప్రతిపక్షాలు చాలా సంవత్సరాలుగా  చెపుతున్నా ప్రధాని మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చిందని, ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అన్నారు.  వివిధ వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు మంచిదని చెప్పిన చిదంబరం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని  కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా జీఎస్టీలో ఈ మార్పులు తీసుకొచ్చిందన్నారు.