జి.ఎస్.టి. బిల్లుపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్?
posted on Nov 28, 2015 8:59AM
.jpg)
ఎన్డీయే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ బిల్లుని ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ దానిపై కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి రాజ్యసభలో బిల్లుని అడ్డుకొంటోంది. ఈ బిల్లులో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మూడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
1.గరిష్టంగా 18 శాతం వరకు మాత్రమే పన్ను విధించడం. 2.దానికి అదనంగా వస్తు ఉత్పత్తి చేసిన రాష్ట్రాలకు 1 శాతం పన్ను విధించుకొనే వెసులుబాటును తొలగించడం. 3.ఈ చట్టం కారణంగా రాష్ట్రాలకు ఏర్పడబోయే రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేసేందుకు, ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచి ఐదేళ్ళ వరకు దేశంలో అన్ని రాష్ట్రాలకు నూటికి నూరు శాతం పరిహారం చెల్లించడం. ఈ మూడు షరతులకు అంగీకరించినట్లయితే తాము ఆ బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెపుతోంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోడి నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ని తన ఇంటికి టీ-సమావేశానికి ఆహ్వానించారు. ఆ సమావేశంలో వారు ఈ బిల్లుపై సుమారు 40 నిమిషాలు చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఇరువురూ కొంత సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోడి సూచించిన విషయాలపై తమ పార్టీ నేతలతో చర్చించి తమ అభిప్రాయం తెలుపుతామని సోనియా గాంధీ ఆయనకు హామీ ఇచ్చారు. ఈ బిల్లును ఎలాగయినా ఈసారి పార్లమెంటులో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఎన్డీయే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చెపుతున్న చివరి రెండు షరతులకు అంగీకరించి దానికి బదులుగా గరిష్ట పన్ను పరిమితిని 18-20 శాతం వరకు ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీని ఒప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం.