ఫొటో దిగవా.. నీ సంగతి చూస్తా!
posted on May 26, 2023 10:23AM
చెప్పినట్లు వినకున్నా.. పథకాలు అందలేదన్నా.. రోడ్లను బాగుచేయమని అడిగినా ప్రజలకు వైసీపీ చుక్కలు చూపిస్తోంది. అలా అడిగిన పానానికి ప్రజలకు వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇస్తున్న షాకులు, కక్ష సాధింపులు మామూలుగా ఉండటం లేదు. కేసులు, పథకాల కోతలతో నిత్య నరకం చూపుతున్నారు. అలాంటి సంఘటన పునరావృతమైంది.
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బ్రోచర్ పట్టుకుని ఫొటో దిగలేదని హోటల్ నిర్వాహకుడు, తెదేపా మైనార్టీ సెల్ నాయకుడు రఫీపై రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఫొటో దిగేందుకు నిరాకరించిన వ్యక్తి కి చెందిన హోటల్ నిర్వహణపై పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కాపు రామచంద్రారెడ్డి అధికారులకు హుకుం జారీ చేశారు. రఫీ కుటుంబ సభ్యులు గ్రామంలో రోడ్డు పక్కన చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రఫీ ఇంటికి వెళ్లారు.
జగన్ మైనార్టీలకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని' చెబుతూ వారికి బ్రోచర్ ఇచ్చారు. ఫొటో దిగాలని కోరగా.. అందుకు రఫీ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తమకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని, తాను తెదేపా మైనార్టీ నాయకుడని రఫీ చెప్పారు. ప్రభుత్వ విప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్నావని, నీ కథ చూస్తానని బెదిరించారు. హోటల్లో శుచి, శుభ్రతపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీఆర్వో రామన్న, పంచాయతీ కార్యదర్శి కుళ్లాయిస్వామినాయుడు హోటల్ ను పరిశీలించి వంటనూనె, దోసె రవ్వ, చపాతీ పిండి నమూనాలు తీసుకెళ్లారు. హోటల్ నిర్వహణకు అనుమతి పత్రాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని అధికారులు అడగ్గా, స్థానిక తెదేపా నాయకులు కేశప్ప, వీఎల్ రామాంజనేయులు, నాగరాజులతో పాటు గ్రామస్ధులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఆర్అండ్ అధికారులు స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. సహాయాన్ని కోరిన వారిపై దాడి చేయడం.. అసభ్య పదప్రయోగం ..లాంటి సంఘటనలు ఇటీవల ఏపీలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఎలక్షన్ ఇయర్.. ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తే.. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అనే కనీసం భయం.. జాగురుకత..వైకాపా నాయకులలో మచ్చుకైనా కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో.. వచ్చే ఎలక్షన్లలో ఎలా రియాక్ట్ అవ్వాలో.. జనానికి ఒక క్లారిటీ రావడం ఖాయమని రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.