జగన్ కడప కోటకు బీటలు?!
posted on May 26, 2023 12:12PM
ఇంత కాలం వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న కడపలో ఆ కుటుంబ ఆధిపత్యం బీటలు వారుతోందా? పులివెందులలో జగన్ ఆధిపత్యానికి గండి పడుతోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ బతికి ఉన్నంత కాలం ఆ కుటుంబం పులివెందులలోనే కాదు.. కడప జిల్లాలోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. వైఎస్ బతికి ఉండగా ఆయన కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉండేది.
ఆయన మరణించి 13 సంవత్సరాలు అయ్యింది. ఆయన మరణం తరువాత వైఎస్ జగన్ ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. అయితే ఆయన కాంగ్రస్ ను వీడి వైసీపీ పేర సొంత కుంపటి పెట్టుకున్నారు. ఏపీలో అధికార పగ్గాలు కూడా అందుకున్నారు. అయితే ఆయన అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఆయన తీరు, అలాగే వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న తీరు వైఎస్ కుటుంబంలో నిలువునా చీలిక వచ్చింది. ఇదే కుటుంబం వైఎస్ కుమారుడు, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ గతంలో విపక్షంలో ఉన్న సమయంలో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సందర్భంలో ఆయనకు అండగా నిలబడింది. ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. జగన్ జైలుకు వెళ్లడంతో మధ్యలో ఆగిపోయిన జగన్ పాదయాత్రను ఆయన సోదరి షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కొనసాగించారు.
అయితే జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్లు కాకుండానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కుటుంబాన్ని నిచ్చెనగా చేసుకుని, ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న జగన్ రెడ్డి ఆ తరువాత క్రమంగా కుటుంబాన్ని దూరం పెడుతూ వచ్చారు. సొంత తల్లి చెల్లి కూడా దూరమయ్యారు. చెల్లి షర్మిల అయితే తెలంగాణకు వలస వెళ్లి తన తండ్రి పేర రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పలు సందర్భాలలో ఆమె సొంత అన్న జగన్ పైనే విమర్శలు గుప్పించారు. తల్లి విజయమ్మ జగన్ కు దూరంగా కుమార్తెతోనే ఉంటున్నారు. జగన్ వైఎస్ ఫ్యామిలీకి దూరమయ్యారని విశ్లేషకులు అంటున్నారు.
ఇక జగన్ సొంత బాబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో తొలుత అంటూ అధికారంలోకి రాకముందు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్.. ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ దర్యాప్తు వద్దనడంతో వివేకా కుమార్తె సునీత జగన్ కు ఎదురు తిరిగారు. సుప్రీం కు వెళ్లి మరీ సీబీఐ దర్యాప్తును సాధించుకున్నారు. ఆ తరువాత ఏపీలో దర్యాప్తు సవ్యంగా జరిగే అవకాశం లేదంటూ విచారణను సుప్రీంను ఆశ్రయించి విచారణను ఏపీ నుంచి తెలంగాణకు మార్పించుకున్నారు.
ఇక వివేకా హత్య కేసు దర్యాప్తు లాజికల్ ఎండ్ దిశగా సాగుతున్న కొద్దీ వైఎస్ కుటుంబ కలహాలు ముదురు పాకాన పడుతున్నాయి. గత ఏడాది జులై 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా ఆనవాయితీకి భిన్నంగా, తల్లి, కొడుకు, అక్కా,చెల్లి ఎవరికి వారుగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు. ఒకరికి ఒకరు తారసపడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో జగన్ ఏకాకిగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితే కడప జిల్లాలో జగన్ కోటకు బీటలు వారేలా చేసిందని అంటున్నారు.