ప్రభుత్వ పాఠశాలలకేం తక్కువ!

 

 

ఒకప్పుడు ప్రైవేటు పాఠశాల అంటే ఎవరో ధనికుల బిడ్డలు చదువుకునే బడి అన్న అర్థం స్ఫురించేంది. మరోపక్క ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం అంటే చాలా చులకనగా ఉండేది. ‘బతకలేని బడిపంతులు’ అన్న సామెత ఊరికనే రాలేదు కదా! కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. మరీ కటిక దారిద్ర్యంలో ఉంటే తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోరన్న అపోహ స్థిరపడిపోయింది. ఒక పక్క ప్రభుత్వ ఉపాధ్యాయులకు సాఫ్టవేర్‌ జీతాలతో సమానమైన జీతాలు అందిస్తున్నా, విద్యార్థుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. దీనికి కారణం ఏమిటి అని వెతికితే...

 

ప్రపంచీకరణ నేపథ్యంలో చదువుకి ప్రాధ్యాన్యత పెరిగిపోయింది. పిల్లల ప్రాథమిక స్థాయి నుంచి కూడా నాణ్యమైన చదువుని అందిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మరి నాణ్యమైన చదువు ఎక్కడ దొరుకుతుంది అని తల్లిదండ్రులు వెతికితే వాటికి జవాబుగా వందలాది ప్రైవేటు బడులు కనిపించడం మొదలుపెట్టాయి. ప్రైవేటు బడుల్లో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో తెలిసే అవకాశం లేకపోవచ్చు. కానీ వారు చూపించే హంగూ, ఆర్భాటం తప్పకుండా చూపరుల మీద ప్రభావం కలిగిస్తాయి. ఇక మోడల్ స్కూల్‌, ఐఐటీ ఓరియంటెడ్‌ సిలబస్‌, ఇంగ్లీషులోనే మాట్లాడిస్తాం... లాంటి ప్రకటనలూ వారిని ఊరిస్తుంటాయి. సరైన చదువు లేకపోవడం వల్లే తమ జీవితాలు ఇలా అయిపోయాయనీ, కనీసం తమ పిల్లల బతుకులైనా అలా కాకూడదని వారు కోరుకుంటున్నారు. అందుకే తలకు మించిన భారమైనా అప్పోసొప్పో చేసైనా తమ పిల్లలని ఖరీదైన చదువులు చదివిస్తున్నారు. ఆ మధ్య ఎర్రచందనం కేసులో పట్టుపడిన ఓ ఇద్దరు దొంగలు తమ పిల్లల ఫీజులు కట్టడం కోసమే తాము దొంగతనాలకు దిగామని చెప్పడం చూస్తే తల్లిదండ్రుల్లో కార్పొరేట్‌ విద్య పట్ల ఎంత మోజు ఉందో అర్థమవుతోంది.

 

 

 

నిజానికి ప్రైవేటు పాఠశాలలు తమ వద్ద చేరిన పిల్లలకు తగిన చదువుని అందిస్తున్నాయా లేదా అంటే అందుకు స్పష్టమైన సమాధానం లభించదు. చాలా ప్రైవేటు బడులలో తగిన విద్యార్హత లేని ఉపాధ్యాయులే బోధిస్తూ ఉంటారు. పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించడం కంటే, వారి మెదడులోకి పాఠాలను చొప్పించడం మీదే వీరి ధ్యాసంతా ఉంటుంది. అందుకోసం వీలైనంత ఎక్కువ సేపు, వీలైనంత ఎక్కువ పాఠాలు చదివించడం మీదే ప్రైవేటు పాఠశాలల దృష్టి అంతా ఉంటుంది. పిల్లల్లో మానసిక, శారీరిక వికాసానికి అవసరమైన ఆటపాటలకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఆడుకోవడానికి తగిన ఆటస్థలాలు కానీ, తరగతి సమయాలు కానీ ఉండవు. ఇక సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలా అన్ని ప్రైవేటు పాఠశాలలూ ఉన్నాయని కాదు కానీ, ఎక్కువ శాతం ప్రైవేటు పాఠశాలల్లోని తీరు ఇది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లవాడు మంచి మార్కులనైతే సాధిస్తాడేమో కానీ, జీవితానికి ఉపయోగపడే పాఠాలను నేర్చుకోలేదు. నిరంతరం చదువుతోనే అతని బాల్యం సాగిపోవడంతో... భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం కానీ, శారిరక దృఢత్వం కానీ అతనికి ఉండవు.

 

ఒకవైపు ప్రైవేటు పాఠశాలల తీరు ఇలా ఉంటే, ప్రభుత్వ పాఠశాలల తీరు మరోలా ఉంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో నిపుణులైన అధ్యాపకులు ఉన్నప్పటికీ వారు ఉద్యోగాన్ని తెచ్చుకునేటప్పుడు చూపిన శ్రద్ధ ఆ ఉద్యోగాన్ని నిర్వర్తించడంలో చూపరన్న అపవాదు ఉంది. బడులకు సరిగా రారనీ, వచ్చినా సరిగా పాఠాలు చెప్పరనీ, చెప్పినా ఫలితాల మీద దృష్టి పెట్టరనీ... నానారకాల విమర్శలు ఉన్నాయి.

 

పాఠశాలల నిర్వహణ మీద కూడా చెప్పలేనన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. బడికి సంబంధించిన ప్రతి పనీ కాంట్రాక్టు పద్ధతి మీదే సాగుతూ ఉండటంతో, ఎవరికి వారు లాభాలను వెనకేసుకునేవారే కానీ... తాము చేసిన పని పది తరాల పాటు అక్కడ చదువుకునే పిల్లలకు ఉపయోగపడిందా లేదా అని ఆలోచించేవారు తక్కువ. అందుకే తాగునీటి వసతి దగ్గర్నుంచీ మరుగుదొడ్లు వరకూ అంతా నాసిరకంగా ఉంటాయి. ఇక మధ్యాహ్న భోజన పథకం, యూనిఫారాలు, తాగునీరు... ఇలా పిల్లలకు కల్పించే ప్రతి వసతిలోనూ ఏదో ఒక కొరత కనిపిస్తూనే ఉంటుంది.

 

తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి మరో కారణం ఆంగ్లంలో విద్యాబోధన. పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యను అందిస్తేనే వాళ్లలో జ్ఞానం పాదుకొంటుందనీ, తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారనీ, మున్ముందు మరో భాషని సైతం తేలికగా నేర్చుకోగలుగుతారనీ పరిశోధనలన్నీ రుజువు చేస్తున్నాయి. కానీ మనమేమో పిల్లవాడికి ఒకటో క్లాసు నుంచే ఆంగ్లం మీద మంచి పట్టు ఉండాలని మురిసిపోతున్నాము. ఆఖరికి పిల్లవాడు ఆంగ్లాన్ని ఎక్కడ మర్చిపోతాడో అని ఇంట్లో కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకునే దుస్థితి మనది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాల్సిన ప్రభుత్వాలు తాము కూడా అదే బాట పట్టేందుకు ప్రయత్నించడం విచారకరం.

 

నిదానంగా ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటీ మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో సున్నా శాతం హాజరు నమోదు కావడంతో, వాటిని దగ్గరలోని మరో పాఠశాలలో విలీనం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య ఇలా దారుణంగా పడిపోవడం మీద మొన్నటికి మొన్న సుప్రీం కోర్టు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము చేయగలిగింది ఏమీ లేదని తెలంగాణ తరఫు న్యాయవాది చేతులెత్తేయడంతో... ‘ఇలాగైతే తెలంగాణను తామే పాలించాల్సి ఉంటుంద’ని హెచ్చరించింది. నిజానికి ప్రభుత్వమూ, ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ తల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం సాధ్యమే!

 

- ప్రజల సంక్షేమం కోసం వందలాది కోట్లను ఖర్చుచేసే ప్రభుత్వానికి, పాఠశాలల కోసం తగినంత నిధులను ఖర్చుచేయడం భారమేమీ కాదు. ప్రతి పాఠశాలలోనూ అన్ని వసతులూ ఉండేలా తగినన్ని నిధులను ఖర్చుచేయడం, ఆ నిధులు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పరీక్షించడం ప్రభుత్వ బాధ్యత. సంఘ రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల హాజరు, పనితీరుని ఎప్పటికప్పుడు గమనించడం మరో ముఖ్య కర్తవ్యం.

 

- ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అరకొర వసతుల సాయంతోనే కొందరు ఉపాధ్యాయులు సాధించే ఫలితాలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. చదువుకోవలసిన అవసరం లేనివారే ప్రభుత్వ పాఠశాలలకు వస్తారన్న అపోహను వదిలిపెట్టి, తమ వద్దకు వచ్చిన ప్రతి పిల్లవాడి మీదా వ్యక్తిగత శ్రద్ధను చూపవలసిన ఉపాధ్యాయులది. తాము ఓ మనిషి జీవితాన్ని తీర్చిదిద్దుతున్నామన్న భావన ఉపాధ్యాయులలో కలిగిన రోజున, ప్రతి ఉపాధ్యాయుడు అద్భుతమైన ఫలితాలను సాధించగలడు.

 

- చదువంటే కేవలం హంగూ, ఆర్భాగం, మార్కులూ, ఆంగ్లంలో ప్రావీణ్యం అన్న భావనను తల్లిదండ్రులు వీడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులు విద్యను అందించేందుకు తగిన నైపుణ్యం ఉన్నవారన్న విషయాన్ని గ్రహించాలి. లక్షలు పోసి తాము చెప్పించే చదువుకీ దీటైన చదువు ప్రభుత్వ పాఠశాలల్లో అందించవచ్చని తెలుసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే మిగతా తల్లిదండ్రులతో కలిసి తమ పిల్లలకు నాణ్యతతో కూడిన చదువు చెప్పేలా ఉపాధ్యాయులతో చర్చించాలి.

 

ఇంత చేశాక ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మెరుగుపడవు!


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu