చివరికి "గో మూత్రం"పైనా పన్ను..!

 

చరిత్రలో ఎవరూ తీసుకోని వింత నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గో మూత్రంపై 5 శాతం పన్ను విధించింది. ఏపీ వ్యాట్ చట్టం-2005లోని 5వ షెడ్యూల్ ప్రకారం గో మూత్రంపై పన్ను విధించే అధికారం తమకు ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం నుంచి వివిధ సంస్థలకు నోటీసులు వెళ్లాయి. డ్రగ్స్, కాస్మోటిక్స్ చట్టం-1940 కింద లైసెన్స్ పొంది తయారు చేసే ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్టే గోమూత్రాన్ని ఔషధంగా ఉపయోగిస్తున్న కారణం చూపి పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. 

 

అనాదిగా భారతీయ సంస్కృతిలో, భారతీయుల జీవితాలలో గోమూత్రం భాగమైంది. ఎంతోకాలం నుంచి నయం కాని జబ్బులకు ఉపశమనాన్ని కలిగించే శక్తి అవు మూత్రానికి ఉందని ఆయుర్వేదం చెబుతోంది. మన పూర్వీకులకు "పంచగవ్య చికిత్స గోమూత్ర విశిష్టత" ఎప్పటి నుంచో తెలుసు. భారతీయులు గోవును మాతృభావంతో "గోమాత"గా ఆరాధిస్తారు. గోవును సమస్త దేవతా స్వరూపంగా భావిస్తారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా గోమాత ప్రాముఖ్యతని, భారతీయులకు , గోమాతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తాయి. 

 

గో మూత్రాన్ని మూఢ నమ్మకంగా చూస్తున్న నాగరిక ప్రపంచానికి దీని విశిష్టత తెలియజేసింది అమెరికన్ పేటేంట్ కార్యాలయం. నాగ్‌పూర్‌లోని గోవిజ్ఞాన అనుసంధాన కేంద్రం దరఖాస్తును పరిశీలించిన కార్యాలయం అనేక చర్చల అనంతరం గో మూత్రానికి "యాంటీ బయాటిక్"గా పేటెంట్ ఇచ్చింది. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను గో మూత్రంపై దృష్టి మళ్లేలా చేసింది. పలు విడతలుగా భారతీయ గో మూత్రాన్ని శోధించిన ప్రపంచ వైజ్ఞానిక లోకం దాని గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పింది. అధిక బరువు, ఉదర సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, చక్కెర వ్యాధి, కాలేయ వ్యాధులు, ఉబ్బసం, పేగు సంబంధిత రుగ్మతలు, కీళ్లవాతం తదితర ఎన్నో జబ్బులకు గో మూత్రం దివ్యౌషధమని దీనిని ఉపయోగించి సత్ఫాలితాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రకటన భారత్‌తో సహా ప్రపంచంలోని చాలా దేశాల వ్యాపారుల నెత్తిమీద పాలు పోసింది. గో మూత్రం కోసం ప్రపంచం మొత్తం భారత్‌పై పడటంతో అది పెద్ద వ్యాపారమైంది. మూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్మే చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి.

 

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా గోశాలలు, రైతుల నుంచి గో ఉత్పత్తుల తయారీ సంస్థలు నిత్యం వేలాది లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశీ ఆవులకు, గో మూత్రానికి గిరాకీ పెరిగింది. దేశీ ఆవుల నుంచి తీసిన మూత్రాన్పి వైద్యంతో పాటు సేద్యానికి ఉపయోగిస్తున్నారు. శుద్ధి చేసిన మూత్రాన్ని లీటర్‌కు రూ.50, సేద్యానికి వినియోగించే మూత్రాన్ని లీటర్‌ను రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయిస్తున్నారు. అటు ప్రభుత్వ వాదన చూస్తే గోమూత్రాన్ని ఆధ్యాత్మిక వస్తువుగా కాకుండా వ్యాపారత్మకంగా ఆలోచించి దానిని వినియోగవస్తువుగా మార్చారని, చట్ట ప్రకారం వినియోగ వస్తువులపై పన్ను విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని చెబుతోంది. ఆయుర్వేద, హోమియోపతి మందుల మాదిరిగానే గో మూత్రాన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధించవచ్చని ఏపీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వాదిస్తోంది. ఆవు మూత్రాన్ని వేదకాలం నుంచి ఆయుర్వేదంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. 

 

నీటిపై పన్ను, పాలపై పన్ను, ఆహారంపై పన్ను ఇలా అవకాశం ఉన్న ఏ అంశాన్ని వదలకుండా పన్నుల జాబితాలోకి తీసుకురావడం..ఆదాయాన్ని పెంచుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. వందలో 20 రూపాయలు ట్యాక్సుల రూపంలో లాగేసుకుంటున్న పరిస్థితి. నోటికి నచ్చిన తిండిని తినేందుకు కూడా ఇంతేసి పన్నులు కట్టాలా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. విభజన తర్వాత ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఏపీ సర్కార్ ఇలాంటి విషయాలను అస్సలు వదలిపెట్టడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ పన్ను వేసి రెవెన్యూ లోటును పూడ్చుకోవాలనుకుంటోంది. ఈ చర్యల పట్ల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

ఏపీని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఫాలో అయితే  గోశాలలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గోశాలలు విక్రయించే మూత్రంతో వచ్చే డబ్బును ప్రస్తుతం వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రొత్సహించాలన్నా..దేశీవాళీ ఆవులను కాపాడాలన్నా గోశాలలు అవసరం. ఇలాంటి పరిస్ధితుల్లో గో మూత్రంపై పన్ను వేస్తే దీనితో తయారయ్యే అన్ని వస్తువులపై ప్రభావం పడి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఒకప్పటితో పోలిస్తే మనదేశంలో గోసంతతి తరిగిపోతోంది. కాని కొంతమంది సంప్రదాయవాదులు, ఔత్సాహికులు గోవులను వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి ప్రయత్నాన్ని ఈ నిర్ణయం చావుదెబ్బ కొడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని పలువురు కోరుతున్నారు.