ఉత్తరాఖండ్‌లో... ప్రజాస్వామ్యానికి విజయం

 

ఎక్కడో దక్షిణాదిన ఉన్న మనకి ఉత్తరాఖండ్‌లో నిన్న జరిగిన పరిణామం ఓ వార్తగానే కనిపించవచ్చు. కానీ ఇది నిజానికి మన భవిష్యత్తుకు ఓ భరోసా! ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని రాజ్యంగంలోని లొసుగులు కారణంగా చూపి కూలదోయాలనుకునే కేంద్ర ప్రభుత్వాలని ఓ హెచ్చరిక! కేవలం రాష్ట్రపతి పాలన విషయంలోనే కాదు, గట్టు దాటే ప్రజాప్రతినిధులు కూడా ఇక మీదట ఉత్తరాఖండ్‌ని చూసి కాస్త జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది.

 

మార్చి 27న ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను విధించినప్పటి నుంచీ కేంద్రానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అక్కడ పాలనలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దె దింపి, ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 9 మంది ఎమ్మెల్యేల సాయంతో తాను ప్రభుత్వాన్ని చేపట్టాలన్నది బీజేపీ ఆలోచన అన్నది దారిన పోయేవాడికి కూడా తెలిసిపోయింది. నిజానికి ఇదే రకమైన మంత్రాంగంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపి, తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుంది బీజేపీ. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయనీ, న్యాయస్థానాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయనీ గ్రహించలేక పరువు పోగొట్టుకుంది. మొదట ఉత్తరాఖండ్‌ హైకోర్టు అక్కడ విధించిన రాష్ట్రపతి పాలన మీద తీవ్రంగా విరుచుకుపడింది. కొన్ని సమయాలలో రాష్ట్రపతి కూడా తప్పు చేసే అవకాశం ఉందంటూ దేశ ప్రథమ పౌరుడినే దెప్పి పొడిచింది. అంతేకాదు! తిరుగుబాటు చేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా బలపరీక్షలో పాల్గొనేందుకు అనర్హులు అంటూ వేటు వేసింది. చివరాఖరికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రికి తన బలాన్ని నిరూపించుకునేందుకు తగిన అవకాశం కల్పించాలంటూ తీర్పుని వెలువరించింది.

 

ఉత్తరాఖండ్‌ న్యాయస్థానం తీర్పుతో కేంద్రానికి తల బొప్పి కట్టిపోయింది. అయినా గంభీరంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ సుప్రీం కోర్టు తలుపులు తట్టింది. కానీ సుప్రీం కోర్టులోనూ కేంద్రానికి అక్షింతలు తప్పలేదు. రాష్ట్రపతి పాలన విధించేంత క్లిష్టమైన సమస్యలు అక్కడ ఏర్పడలేదు కదా అంటూ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. చివరికి హైకోర్టు వెలువరించిన తీర్పుని బలపరుస్తూ నిన్న హరీష్‌ రావత్‌ తన బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశాన్ని ఇచ్చింది. సుప్రీం అదుపాజ్ఞలలో ఉత్తరాఖండ్‌లో నిన్న బలప్రదర్శన జరిగింది. చివరి నిమిషంలో బీఎస్‌పీ కూటమిలోని ఆరుగురు సభ్యులు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడం, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అటూఇటూ అవడం జరిగినా 71మంది సభ్యులున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో హరీష్‌ రావత్‌ సగానికి పైగా సభ్యుల విశ్వాసాన్ని సాధించారన్నది అనధికారికంగా తేలిపోయింది. దీంతో బహుశా సుప్రీం కోర్టు అక్కడ రాష్ట్రపతి పాలనను రద్దు చేసి రాజ్యంగబద్ధమైన ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పవచ్చు.

 

ఉత్తరాఖండ్‌లోని పరిణామాలు నిజంగా బీజేపీకి మింగుడుపడనివే. తాము కాంగ్రెస్‌ విధానాలకంటే భిన్నంగా ఉంటామంటూ బీరాలు పోయిన బీజేపీ చివరికి అలాంటి కుయుక్తులకే దిగడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నల్లధనాన్ని వెలికితీసుకురావడంలో కానీ, దేశంలోని అసహన వ్యాఖ్యలను ఖండించడంలో కానీ ఇప్పటికే బీజేపీ విఫలం చెందిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, తెలంగాణకు కరువు సాయం వంటి విషయాలలో బీజేపీ మాట తప్పుతోందంటూ తెలుగురాష్ట్రాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీని నిజంగానే ఇదో ఎదురుదెబ్బ. అంతేకాదు! ఇవాళ తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద కూడా సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే ఐపీఎల్‌ క్రికెట్‌లో ఎక్కడ మంచి బేరం పలికితే ఆ జట్టులో చేరినంత తేలికగా పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధుల గట్టుదాట్లకు కూడా అడ్డుకట్ట పడినట్లే! అందుకనే నిన్న ఉత్తరాఖండ్‌లోని పరిణామం ప్రజాస్వామ్యానికి ఓ కీలక విజయంగా భావిస్తున్నారు విశ్లేషకులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu