బాలికల బంగారు అడుగులు!! 

 

ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. బుల్లి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ప్రతి రోజూ పండగలాగే ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు భావించేవారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే కడుపులో ఉన్న బిడ్డను చిదిమేయడం. ప్రసవం అవ్వగానే ఆడపిల్ల అని తెలియగానే వెంటనే అమ్మేయడం లేదా చెత్త కుప్పలో పడేయడం. ఆడపిల్లను  విలాసవస్తువుగా  మార్చడం. ఇవన్నీ భారతదేశం అంతటా పాతుకుపోయి ఉన్నాయి. సుమారు దశాబ్ద కాలం కిందట ఇలా అమ్మాయిలను భూమిధ పడకముందు మరియు భూమి మీద పడ్డాక తుంచేయడం ఎక్కువగా ఉండేది. పలుతంగానే ప్రస్తుతం అబ్బాయిల అమ్మాయిల నిష్పత్తితో పోలిస్తే అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. నిన్నటి పసిబిడ్డలే ఈరోజు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అన్నట్టు. ఈరోజు పెళ్లి కావలసిన అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం. ఇప్పట్లో అబ్బాయిలు పెళ్లి కాకుండా మిగిలిపోతుండటానికి కూడా కారణం అవుతోందని చెప్పవచ్చు. 

ఇంత విషయం ఆడపిల్లలను తుంచేయడం వల్ల జరుగుతోంది. దీని కోసం ఏర్పాటైనదే జాతీయ బాలికల దినోత్సవం. ప్రతి రోజు వెనుకా ఒక మంచి ఆశయం ఉన్నట్టే, ఈ జాతీయ బాలికల దినోత్సవం వెనుక కూడా గొప్ప ఆలోచనలు ఉన్నాయి.

సంరక్షణ!!

సమాజంలో ఆడపిల్లలను సంరక్షించుకోవడం రోజురోజుకు కష్టంగా మారిపోతోంది కారణం గద్దలు కోడిపిల్లల్ని తన్నుకుపోయినట్టు కొందరు ఆడపిల్లల్ని అపహరించడం, శారీరకంగా వేధించడం, స్మగ్లింగ్ చేయడం, రెడ్ లైట్ ఏరియాలలో అమ్మేయడం. ఇట్లా అన్ని విషయాల నుండి ఆడపిల్లలకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంది. ఆ సమస్యలన్నింటి నుండి ఆడపిల్లను కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు స్కూల్స్ కు వెళ్లడం, తిరిగి రావడంలోనే బోలెడు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. వాటి విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి.

హక్కుల కానుకలివ్వాలి!!

ఆడపిల్లలకూ కొన్ని హక్కులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది చదువుకోవడం. ఆడపిల్లకు చదువు ఎందుకు అని నిర్లక్ష్యం చేయకూడదు. అంతరిక్షానికి వెళ్లొచ్చిన ఆడపిల్ల అంటారు అందరూ కానీ గమనించాల్సిన విషయం ప్రతి ఆడపిల్ల అంతరిక్షానికి వెళ్ళలేదు కాబట్టి ప్రతి ఆడపిల్ల అంతరిక్షం కాదు కనీసం ధైర్యంగా బయటకు వెళ్లి రాగలిగే సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లింగ వివక్షత లేకుండా చక్కగా చదువుకోవాలి. ఎంతోమంది మహిళలు పోరాటం చేసి మరీ చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కాబట్టి చదువుకోవడం, తగినంత స్వేచ్ఛ, లింగవివక్షత లేకుండా చూడటం.  ప్రతి ఆడపిల్లకూ తప్పనిసరిగా అందివ్వాల్సిన హక్కులు.

ఎదుగుదలకు చేయూతనివ్వాలి!!

చిన్న ఆసరా దొరికితే అంచెలంచెలుగా ఎదిగిపోయే వాళ్ళు ఎందరో ఉంటారు. ఈ కోవలో ఆడ, మగ ఇద్దరూ ఉంటారు కూడా. కానీ సమాజంలో చూస్తే మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు ఇలాంటి చేయూత కాస్త తక్కువగా ఉండేది. అలాంటి వాళ్ల అభివృద్ధి కోసం ఎన్నో స్వచ్చంధ సంస్థలు ముందుకొచ్చి నడుం బిగించాయి. పాలితంగా స్త్రీలకు ఎన్నో ఉపాధి మార్గాలు ఇప్పట్లో చాలా చోట్ల ఉన్నాయి. ఇక ముఖ్యంగా బాలికలకు ఉత్తమమైన విద్యను అందించడం ద్వారా వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవడానికి చేయుతనిచ్చినట్టు అవుతుంది. ఏ ఆడపిల్ల ఆర్థిక సమస్యల వల్ల చదువు ఆపే పరిస్థితి రాకుండా చూడటం సమాజం, ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు కలసికట్టుగా చేయవలసిన పని.

ఆహారం!!

ఆహారం ఎంతో ముఖ్యమైనది.  ప్రతి ఆడపిల్లకు తన జీవితంలో పీరియడ్స్ లోకి అడుగుపెట్టడం అనేది తప్పనిసరి. అయితే శరీరంలో కలిగే మార్పులను అనుసరించి పోషకారం కూడా తప్పనిసరి. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో పోషకార లోపంతో ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు, మహిళల శాతం ఎక్కువ. కాబట్టి మంచి ఆహారం పొందడం ఆడపిల్లల హక్కు, అందించడం ప్రభుత్వ, కుటుంబ బాధ్యతలు.

ఇట్లా విద్య, వైద్యం, హక్కులు, ఎదుగుదల ముఖ్యంగా లింగవివక్ష అరికట్టడం ప్రతి ఆడపిల్ల జీవితానికి అందరూ కలసి అందించాల్సిన ముఖ్య అవసరాలు!!

◆ వెంకటేష్ పువ్వాడ