డబ్బు లేక చెత్తతోనే భార్యకు అంత్యక్రియలు..
posted on Sep 5, 2016 7:34PM

మానవత్వం మంటగలిసింది అని నిరూపించే ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పేదరికంలో మగ్గుతూ భార్య అంత్యక్రియలు చేయలేని ఓ భర్త చుట్టుపక్కల దొరికిన చెత్తాచెదారంతో ఆమె చితికి నిప్పుపెట్టాడు. ఇండోర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని రతన్‌ఘర్ గ్రామంలో నోజీభాయ్ అనే మహిళ మృతి చెందడంతో ఆమె భర్త జగదీష్ దహన సంస్కారాలు చేయడానికి ఆమెను శ్మశానవాటికకు తీసుకెళ్లాడు. అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.2,500 చెల్లిస్తే గానీ కుదరదని పంచాయితీ పెద్దలు తేల్చి చెప్పారు. అంత డబ్బు లేదని జగదీష్ ఎంత బతిమలాడినా వారి మనసు కరగలేదు. దీంతో దిక్కుతోచని అతను మూడు గంటల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్తుకాగితాలు, బ్యాగులు పోగుచేసి చితి ఏర్పాటు చేసి నిప్పుపెట్టాడు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తనకు కలప దుంగలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రతన్‌ఘర్ గ్రామపెద్దలపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.