ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజి డీసిపి రాధాకిషన్ అరెస్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ ఐల విచారణ పూర్తైన సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం ఈ కేసుకు సంబంధించి పలువురి వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. వారి వాంగ్మూలాల ఆధారంగానే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అలాగే తిరుపతన్న, భుజంగరావులను కూడా పోలీసులు ఇప్పుడో ఇహనో అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తాజాగా రాధాకిషన్ ను అరెస్టు చేయడానికి  ముందు ఆయనను దాదాపు పది గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.  

రాధాకిషన్  అసెంబ్లీ ఎన్నికల సమయంలో హవాలా వ్యాపారులను నిర్బంధించి  డబ్బులు ఒక పార్టీకి చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు వ్యాపారులపై రాధా కిషన్‌ రావు నిఘా పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే మాజీ డీసీసీ రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు.

లుకౌట్‌ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రణీత్‌ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై   నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో  వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.