హర్షకుమార్ అరెస్ట్, రాజమండ్రి జైలుకి తరలింపు
posted on Jul 13, 2015 7:18AM
(2).jpg)
అమలాపురం మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ క్రైస్తవుల శ్మశానవాటిక కోసం ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో మొదలుపెట్టిన నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసారు. ఆ సందర్భంగా ఆయన పోలీసులు తన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే తన వద్ద ఉన్న రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించారు. తను ఒట్టినే బెదిరించడంలేదని తెలిపేందుకు ఆయన గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కానీ పోలీసులు ఆయన వద్ద ఉన్న తుపాకిని స్వాధీనం చేసుకొని ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆత్మహత్యాప్రయత్నం చేసినందుకు, బహిరంగ ప్రదేశంలో గాలిలోకి కాల్పులు జరిపినందుకు పోలీసులు ఆయనని 3వ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆయనకు ఈనెల 23వరకు రిమాండ్ విదించారు. పోలీసులు ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.