రాజయ్య కోడలిది ఆత్మహత్యే
posted on Nov 27, 2015 8:58AM
(2).jpg)
వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యేనని దృవీకరిస్తూ హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వరంగల్ పోలీసులకు ఒక నివేదిక పంపింది. ఈనెల 4వ తేదీన రాజయ్య ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు అభినవ్(7), ఆయాన్(3), శ్రీయాన్(3)లు సజీవ దహనమయ్యారు. సారిక తన మరణానికి ముందు చాలాసార్లు తన న్యాయవాదిని కలిసి తనను తన భర్త అనిల్, మావగారు రాజయ్య, ఆయన భార్య మాధవీలత వేధిస్తున్నారని తెలిపింది. రెండు మూడుసార్లు వారిపై పోలీసులకు పిర్యాదు కూడా చేసింది. వాళ్ళు తనను ఆత్మహత్య చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు కూడా తెలిపింది. కనుక రాజయ్య కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేసి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటాన స్థలం నుండి పోలీసులు సేకరించిన ఆధారాలను, పోస్ట్ మార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత సారికది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ నిపుణులు అధికారికంగా దృవీకరించారు. గ్యాస్ లీకయి మంటలు వ్యాపించడంతో అందులో వారు సజీవ దహనమయినట్లు తమ నివేదికలో దృవీకరించారు. ఈ నివేదిక వలన సారిక భర్త అనిల్, రాజయ్య అతని భార్య మాధవీలతపై హత్యారోపణలు కొట్టివేయబడవచ్చును. కానీ సారికను మానసికంగా, శారీరికంగా వేధించినందుకు, ఆమెను ఆత్మహత్య చేసుకొనేందుకు ఉసిగొల్పినందుకు, ఆ కారణంగా ఆమె మరణానికి, అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారుల మరణానికి కారణమయినందుకు వారికి శిక్షలు పడటం ఖాయం. వారు నేరుగా ఆమెను హత్య చేయకపోయినా వారి మరణాలకి కారకులు మాత్రం వారే. అది హత్య కంటే చాలా హేయమయిన ఘాతుకం అని చెప్పకతప్పదు.