అమెరికాలోని ఇస్కాన్ టెంపుల్ లక్ష్యంగా కాల్పులు

ప్రముఖ హిందూ దేవాలయం ఇస్కాన్ టెంపుల్ లక్ష్యంగా అమెరికాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.    స్పానిష్ ఫోర్క్‌లో ఉన్న  ఇస్కాన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల ఘటనను శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యలయం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆలయ అధికారులకు, భక్తులకు మద్దతు ప్రకటించింది. స్థానిక యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని, నిందితులను పట్టుకోవాలని స్పష్టం చేసింది. అలాగే ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరింది. ఆలయ నిర్వాహకుల సమాచారం మేరకు  ఆలయంలో భక్తులు ఉన్న సమయంలోనే దాడి జరిగింది. దుండగులు 30 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆలయ స్వాగత తోరణాలు, కిటికీలు, గోడలు దెబ్బతిన్నాయి. గోడల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.

కాగా హిందుత్వపై విద్వేషంతోనే ఈ దాడి జరిగిందని ఇస్కాన్ ఆరోపిస్తోంది.  ఈ ఆలయంపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదని పేర్కొంది. గత నెలలోనూ ఇటువంటివి మూడు సంఘటనలు జరిగాయని ఇస్కాన్ ప్రతినిథులు తెలిపారు.  ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.  ఇలాంటి కాల్పుల సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు  భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  ఇక అమెరికాలోని హిందూ ఆలయాలపై దాడులు జరగడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాది మార్చిలో కాలిఫోర్నియాలో స్వామి నారాయణ ఆలయంపై దాడి జరిగిన సంగతి విదితమే.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu