ముగ్గుర్ని చంపిన కోడి!
posted on Oct 9, 2024 3:49PM

తాము పెంచుతున్న పందెం కోడి చేత ఈత కొట్టించాలని ప్రయత్నించి ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కవ్వగుంట సమీపంలో వున్న పోలవరం కాలువలో ఈ దుర్ఘటన జరిగింది. శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (50)కి పందెం కోళ్ళని పెంచడం అంటే సరదా, ఆయన కుమారులు తొమ్మిదో తరగతి చదువుతున్న మణికంఠ (16), ఏడో తరగతి చదువుతున్న సాయికుమార్ (13) కూడా కోళ్ళ పెంపకంలో తండ్రికి సహకరిస్తూ వుండేవారు. పందెం కోడిని నీళ్ళలో ఈత కొట్టిస్తే బలంగా తయారవుతుందన్న ఉద్దేశంతో తండ్రి కొడుకులు తమ పందెం కోడిని పోలవరం కాలువ దగ్గరకి తీసుకెళ్ళాడు. అక్కడ కోడి చేత ఈత కొట్టిస్తూ వుండగా ముగ్గురూ కాలువలో పడి గల్లంతయ్యారు. ఆ తర్వాత స్థానికులు వెతకగా తండ్రితోపాటు ఒక కొడుకు మృతదేహం కనిపించాయి. మరో కొడుకు మృతదేహం ఇంకా కనిపించలేదు. ఇంత దారుణం జరగడానికి కారణమైన కోడి మాత్రం హాయిగా తిరుగుతోంది.