తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించనున్న రైతు బిడ్డ
posted on Dec 18, 2025 11:09AM

ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. అందులోనూ రైతుకు అయితే ఉన్న ఊరే కాదు.. తాను సాగు చేసే భూమి కన్నతల్లి కంటే ఎక్కువే. రైతుకు భూమితో ఉన్న అనుబంధాన్ని పోల్చడానికి ఏ బంధమూ సరిపోదు. రైతు బిడ్డ ఏ దేశమేగిగా, ఎందు కాలిడినా సొంత గడ్డ, తాను సాగు చేసిన పొలం మీదే ధ్యాస ఉంటుంది. ఎక్కడా ఇమడ లేడు. ఎప్పుడెప్పుడు వచ్చి సొంత ఊర్లో, సొంత భూమిలో సాగు చేసుకుందామా అని తహతహలాడుతుంటాడు. అదిగో అచ్చం అలాంటి పదహారణాల రైతు ఉదంతమిది. భూమితో ఉన్న అనుబంధానికి తార్కానంగా తన సొంత భూమిలో తాను బతికుండగానే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. వివరాల్లోకి వెడితే..
కళ్లెం నరసింహారెడ్డి పదహారణాల రైతు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు. ఈ వయసులోనూ వ్యవసాయం మీద మమకారం పోలేదు. భూమిపై అనురక్తి తగ్గలేదు. సొంత ఊరు, దేశం వదిలి మూడు దశాబ్దాల పాటు అమెరికాలో ఉన్నా.. ఆయన వ్యాపకం వ్యవసాయమే. అమెరికాలో ఐదువేల ఎకరాలు లీజుకు తీసుకుని రకరకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నుంచి ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకున్నారు.
అయితే మాతృభూమిపై మమకారం తీరలేదు. అందుకే స్వదేశానికి, అందులోనూ సొంతగడ్డ తెలంగాణకు వచ్చేశారు. చిలుకూరు సమీ పంలో తన పేరుమీద అంటే కళ్లెం నర్సింహా రెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో సాగు పద్దతులతో పేరు గడించిన కళ్లెం ఇప్పుడు తన సొంత ఫామ్ లో మొక్కలు...చెట్లు పెంచిప్రకృతి లోనే జీవితం గడుపుతున్నారు. నిత్యం తన వ్యవసాయ క్షేత్రంలో కలియదిరగందే, ఆయనకు రోజు గడవదు, నిద్రపట్టదు. తొమ్మది పదులకు చేరువ అవుతున్న ఈ వయస్సులోనూ ఆయన పనులు ఆయనే చేసుకుంటారు. తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కళ్లెం నర్సింహా రెడ్డి ఇప్పుడు నేల తల్లితో తన మమకారాన్ని వినూత్నంగా చాటి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. తన వ్యవసాయ క్షేత్రంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరణించిన తన భార్య విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని మరణించిన తరువాత తాను తన భూమాతతో అనుబంధం కొనసాగుతుందని చాటారు.
తన భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం (డిసెంబర్ 19)న ఈ విగ్రహాలను ఆవిష్కరిం చనున్నారు. అంతే కాకుండా భార్య మరణానంతరం కూడా ఆమెకు తోడుగా తాను ఉన్నానని కూడా ఈ విగ్రహాల ఏర్నాటు చేసినట్లు ఆయన చెబుతారు. ఈ విగ్రహాలను కళ్లెం నరసింహారెడ్డి స్వయంగా శుక్రవారం (డిసెంబర్ 19) ఆవిష్కరించనున్నారు. ఆమె ఓంటరిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో తన విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టుకుంటున్నారు. ఈ విగ్రహాలు స్వయంగా ఆయనే ఆవిష్కరిస్తారు.