తలసాని వ్యవహారంతో నాకు సంబంధం లేదు.. భన్వర్ లాల్
posted on Oct 21, 2015 4:55PM

తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభకు ఎంపికయి ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి మారి మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తలసాని రాజీడ్రామా సమస్య మాత్రం ఇంకా ఓ కొలిక్కి రానే రాలేదు. తాను రాజీనామా చేశానని చెపుతున్నా దానికి సంబంధించి స్పీకర్ కూడా తగిన చర్యలు తీసుకోకపోవడంతో.. ఈ విషయంపై కోర్టులో విచారణ జరిపినా కోర్టు కూడా తాము చేయడానికి ఏం లేదని.. కానీ ఈ విషయంలో స్పీకర్ త్వరగా ఏదో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కూడా తనకు ఈ విషయంతో సంబంధం లేదని వ్యాఖ్యనించారు. భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల కమిషనర్ నసీం జైదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుశాతం ఓట్ల తొలగింపు జరిగింది.. నిజామాబాద్ జిల్లాలో 26 శాతం ఓట్ల తొలగింపు జరిగింది.. ఈ ఓట్ల తొలగింపుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో తలసాని రాజీనామా గురించి అడుగగా ఈ వ్యవహారం తన పరిధిలో లేదని.. తాను కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ గా మాత్రమే ఉన్నానని.. తాను ఏపీకి చెందిన వాడినని సమాధానమిచ్చారు.