క్యాసినో కేసులో వంశీకి ఈడీ నోటీసులు.. తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డికి కూడా

చీకోటి ప్రవీణ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోల నర్వాహకులు చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ ఆయన ద్వారా రాబట్టిన సమాచారంతో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చీకోటి ప్రవీణ్ పలువురు రాజకీయ నేతలతో జరిపిన వాట్సాప్ చాటింగ్ ను ఈడీ గుర్తించింది. 

ఇప్పటికే ఈ కేసులో చీకోటి ప్రవీన్ అతడి సహచరుడు దాసరి మాధవరెడ్డి నివాసాలలో ఈడీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి విదితమే.చీకోటి ప్రవీణ్ కేసులో ప్రవీణ్ తోపాటు మరో ఏజెంట్ దాసరి మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు పలు సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి.

చీకోటి ప్రవీణ్ విచారణలో బయటపెట్టిన వివరాల ఆధారంగా ఈడీ పలువురు ప్రజా ప్రతినిథులకు నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిలో  ఒకరు వల్లభనేని వంశీ కాగా మరొకరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అని తెలిసింది. ఇక మిగిలిన వారిలో తెలంగాణ మంత్రులు శ్రీనివాసగౌడ్, చామకూర మల్లారెడ్డి ఉన్నారని తెలిసింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కుటుంబానికి అత్యంత సన్నిహితులు మరొకరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

వీరిని సోమవారం విచారణకు హాజరు కావల్సిందిగా ఈడీ ఆ నోటీసులలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన క్యాసినే కేసులో చీకోటి ప్రవీణ్ ను ప్రశ్నించిన ఈడీ అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. అలాగే ప్రవీణ్, మరి కొందరి బ్యాంకు లావాదేవీలను సైతం పరిశీలించి కీలక ఆధారాలను సేకరించింది. దాదాపు పాతిక కోట్ల రూపాయలకు పైగా అనుమానాస్పద లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు చెబుతున్నారు. ఆ నగదు ఎక్కడ నుంచి ఎలా వచ్చింది? ఎలా ట్రాన్స్ ఫర్ చేశారు తదితర అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, తెలంగాణ మంత్రులు శ్రీనివాసగౌడ్, చామకూర మల్లారెడ్డితో పాటు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులలో ఒకరికి నోటీసులు జారీ చేసింది.  వచ్చే రెండు మూడు రోజులలో వీరిని ఈడీ విచారించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.