మిథున్ రెడ్డి అరెస్టు దాని వెనక కథ కేంద్రం, కమామిషు!
posted on Jul 20, 2025 12:40PM

నిజానికి మిథున్ రెడ్డి అరెస్టు కారనే అనుకున్నారంతా. కారణం ఇంతకన్నా మించిన కేసైన వివేకా కేసులోనే అవినాష్ ఇంత వరకూ అరెస్టు కాలేదు.. జగన్ అరెస్టు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఆ మాటకొస్తే.. మద్యం వ్యవహారంలో జగన్ అరెస్టే ముందు అవుతుందనుకున్నారు. కానీ కాలేదు.
దానికి తోడు ఛత్తీస్ గడ్ మద్యం కేసు కేవలం 2వేల కోట్లు. దాన్ని టేకప్ చేసి ఈడీ, సీబీఐ.. 3వేల కోట్లకు పైగా ఉన్న ఏపీ లిక్కర్ కేసును టేకప్ చేయలేదు. ఢిల్లీ కేసు కూడా ఏమంత ఎక్కువ లేదు ఐదారు వందల కోట్లకు మించదు. కానీ కేంద్ర నాయకత్వం ఈ విషయంలో చూపిన అత్యుత్సాహం అందరికీ తెలిసిందే. దీంతో చేసేది లేక ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్- సిట్ ర్యాప్తు చేపట్టింది. కట్ చేస్తే ఇప్పుడు ఏ 4 మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది.
ఇందులో ప్రధానంగా వినిపిస్తోన్న ప్రశ్న ఏంటంటే ఇప్పటి వరకూ ఏపీ మద్యం కేసును ఈడీ, సీబీఐ ఎందుకు అటెంప్ట్ చేయలేదు?. అంటే వైసీపీ బీజేపీకి ఉన్న చీకటి సంబంధమే కారణమని తెలుస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వమే చొరవ తీసుకుని.. ఈ కేసును డీల్ చేసినట్టుగా కనిపిస్తోంది.
బేసిగ్గా చంద్రబాబు విషయంలో రెండు కేసులు పడితే వాటిలో ఐటీ కేసు ఒకటి కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసు మరొకటి. ఈ రెండూ కూడా కేంద్ర స్థాయిలోనివే. ఇక్కడివి కావు. చంద్రబాబు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారంటే ఎక్కడో మహారాష్ట్ర పూనేలో ఉన్న జీఎస్టీ అధికారులు దీన్ని కదిల్చి.. అక్కడి నుంచి ఏపీకి ఈ కేసును మళ్లించి.. ఆపై బాబును అరెస్టు చేయించారు. అంటే కేంద్రమే దీని వెనక ఉందని మాట్లాడుకున్నారు అప్పట్లో. ఒక రకంగా చెబితే జగన్ కి ఈ అరెస్టు మరక అంటకుండా జాగ్రత్త వహించారన్నమాట.
ఈ మాత్రం కోపరేషన్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి లేదన్నది.. కొందరు విశ్లేషకుల వాదన. మళ్లీ ఇదే కూటమిలో ఇక్కడ ఏపీలో బీజేపీ కూడా ఉంది. ఆ మాటకొస్తే బీజేపీకి టీడీపీతో జతకట్టాలని లేదని కూడా మాట్లాడుకున్నారు ఎన్నికల ముందరి కాలం రోజుల్లో. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలన్నీ మనకు తెలిసిందే.
ఇప్పుడీ మద్యం కేసు ద్వారా ఏం తెలుస్తోందంటే.. ఇది కేంద్ర స్థాయిలో జరగాల్సిన కేసు. ఇందులోని నిధులు దుబాయ్ వరకూ వెళ్లినట్టు చెబుతున్నారు. అంతే కాదు నాలుగైదు మార్గాల ద్వారా మద్యం మనీ హవాలా రూపంలో మిథున్ రెడ్డికి చేరాయనీ అంటున్నారు. అంటే మనీ ల్యాండరింగ్ జరిగినట్టు ఆధారాలున్నాయి. అయినా గానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కనీసం టేకప్ చేయడం లేదంటే దానర్ధమేంటి? జగన్ అరెస్టు గానీ ఆయన పార్టీ లీడర్ల అరెస్టు చేయడానికి గానీ కేంద్రం సమ్మతంగా లేక పోవడమే కదా? అన్నది కొందరు సంధిస్తోన్న ప్రశ్నాస్త్రం.
మొన్న అమిత్ షా వచ్చినపుడు కూడా బాబు, పవన్ ముందు జగన్ రెడ్డి గురించి వాకబు చేయడం కనిపించింది. నిజానికి కేంద్రం తలుచుకుంటే జగన్ మోహన రెడ్డి అరెస్టుకు కేవలం మద్యం కుంభకోణమే అవసరం లేదు. ఆయనపై ఇప్పటికే ఉన్న 33 కేసులు చాలు. వీటిలో ఏదో ఒకటి అరెస్టు చేయడానికి సరిపోతుంది. గత కొన్నేళ్ల క్రితం.. ఈడీ, సీబీఐ స్వయంగా వెళ్లి కేంద్రంతో మొర పెట్టుకున్నాయి. ఇన్నాళ్ల పాటు ఆయన బెయిలు పై బయట ఉన్నాడని. అయితే ఇదే జగన్, చంద్రబాబు మద్యం కేసులో బెయిలుపై బయట తిరుగుతున్నట్టు చెప్పడం వింత విడ్డూరంగా ఉందంటారు కొందరు నిపుణులు.
టోటల్ గా ఈ వ్యవహారమంతా చూస్తుంటే జగన్ కేంద్రం అండతోనే ఇప్పటి వరకూ బయట తిరగగలుతున్నారనీ. కేంద్ర నాయకత్వానికి వైసీపీకి సంబంధముందా లేదా చెప్పడానికి ఈ ఒక్క ఎవిడెన్సు చాలని అంటారు నిపుణులు. ఒక వేళ నిజంగా జగన్ని అరెస్టు చేయాలంటే వారికి చిటికెలో పని. గతంలో శశికళను ఇలాగే జైలుకు పంపిన పరిస్థితి ఉంది. అదే జగన్ పట్ల వారిలాంటి చర్య చేపట్టడం లేదంటే జగన్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తుందా? అన్న అనుమానాలున్నాయని అంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు.