నటసింహం ఆప్తుడు తన్నులు తిన్నాడు
posted on Nov 7, 2015 11:59AM

సింహం గుడ్డిదైతే ఎలుకలు ఎకసెక్కాలాడాయంట...! ఇప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా కళ్ళుమూసుకున్న నటసింహం పరిస్థితి కూడా అలాగే తయారైంది. నటసింహం నిజంగానే సింహమే... కానీ ఆయన చుట్టు వున్నది మాత్రం ఎలుకలు కాదు... ఏకంగా పందికొక్కులు... ఇసుకను బొక్కేసే పందికొక్కులు. శాండ్‌ని శాండ్‌విచ్‌లాగా మింగేసే ప్రయత్నంలో ఆ పందికొక్కుల కీచులాటలు నటసింహం ప్రతిష్టకే ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వచ్చాయి.
అసలింతకీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకే బంగారమైపోయింది. బెల్లం వున్న చోట ఈగలు మూగినట్టు ఇసుక వున్న చోట ఇసుక బకాసురుల మాఫియా మూగుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రముఖుడు నటసింహం చుట్టూ తిరిగే ఒక వ్యక్తికి తూర్పు గోదావరి జిల్లాలోని ఒక ఇసుక ర్యాంపు మీద కన్నుపడింది. నటసింహం పేరు చెప్పి ఆ ఇసుక ర్యాంపును బినామీ పేరుతో సొంతం చేసుకున్నాడు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఆ ఇసుక ర్యాంపు కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం కొంతమందిని పార్టనర్లుగా చేర్చుకున్నాడు. సొంత పార్టీలో ఎవరూ లేనట్టుగా ప్రతిపక్ష హోదాకూడా లేని ఓ పార్టీకి చెందిన వ్యక్తిని ఒక పార్టనర్‌గా చేర్చుకున్నాడు. ఆ పార్టనర్ మరెవరో కాదు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆత్మకి ఆత్మబంధువుగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తికి స్వయానా బావమరిది. వీళ్ళంతా కలసి ‘నటసింహం’ పేరు ఉపయోగించుకుంటూ మూడు జేసీబీలు ఆరు లారీల్లాగా ఇసకని రొల్లుకున్నారు..
ఇంతవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాతే అసలు ప్రాబ్లం వచ్చింది. ఈమధ్య తూర్పు గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపు ద్వారా వచ్చిన కొన్ని కోట్ల రూపాయలని మన నటసింహం గారి తాలూకు వ్యక్తి గప్‌చుప్‌గా తన జేబులో వేసేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సదరు బావమరిది ఆవేశంతో రగిలిపోయాడు. నువ్వు జేబులో వేసుకున్న డబ్బులో నా వాటా నాకివ్వు అని డిమాండ్ చేశాడు. అయితే నటసింహం తాలూకు మనిషి ఈ డిమాండ్‌ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. రేపు మాపు అని తిప్పుకోవడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడు.. లెక్కలు చెప్పడు... డబ్బులు గట్టిగా అడిగితే ఎక్కువగా మాట్లాడితే నటసింహంతో నీ గురించి బ్యాడ్‌గా చెబుతా అని బెదిరించడం మొదలెట్టాడు. దాంతో బావమరిది గారికి ఫుల్లుగా కోపం వచ్చేసింది. నటసింహం తోకలాంటి సదరు వ్యక్తినిహైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌కి పిలిపించాడు. అక్కడ అతన్ని ఆ ఎడాపెడా తన్నాడు. దాంతో ఈ విషయం పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ప్రస్తుతం ఈ విషయంలో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఈ అంశంలో ఇద్దరూ ఇసుక మింగే పందికొక్కులే. కాకపోతే ఈ పందికొక్కులకారణంగా సింహం లాంటి నటసింహానికి చెడ్డపేరు వస్తోంది. నటసింహం ఎవరు ఎలాంటివారో తెలుసుకోకుండా తనచుట్టూ చేర్చుకోవడం వల్ల వాళ్ళు ఇలాంటి అవినీతి పనులకు పాల్పడుతూ నటసింహానికి చెడ్డపేరు తెస్తున్నారు. నటసింహానికి తోకలాగా వుండే వ్యక్తిని వైఎస్సార్ ఆత్మకి బామ్మర్ది కొట్టాడన్న విషయం ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మార్మోగుతోంది. ఈ విషయం నలుగురికీ తెలిసినా నటసింహానికి తెలియకపోవడం ఆశ్చర్యకరమే. అందువల్ల మచ్చలేని చంద్రుడి లాంటి నటసింహం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జూలు విదల్చాలని, తన చుట్టూ వున్నవాళ్ళు చేస్తున్న అవకతవకలను అరికట్టాలని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేవాళ్ళని దూరంగా పెట్టాలని ఆయన్ని అభిమానించేవారు కోరుకుంటున్నారు.