గాంధీ విగ్రహ ఘటనపై స్పందించిన ట్రంప్
posted on Jun 9, 2020 2:26PM
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీస్ హత్య చేయడంతో.. అమెరికా జాత్యహంకార వ్యతిరేక నిరసనలతో అట్టుడికింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకి వ్యతిరేకంగా చాలామంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. భారత రాయబార కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహానికి రంగు పులిమారు, విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అవమానకరమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గాంధీ విగ్రహంపై దుండగుల దుశ్చర్య విషయంలో భారత్‌ను అమెరికా క్షమాపణలు కోరింది. విగ్రహ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది.