ట్రంప్ భార్య మెలానియా.. మళ్లీ అదే సీన్..

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనల వల్ల వచ్చిన అప్ డేట్స్ ఏమో కానీ... ట్రంప్, ఆయన సతీమణి మెలానియా మధ్య ఉన్న చిరుబుర్రులాటల అప్ డేట్స్ గురించిన వార్తలు మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నాయి. ట్రంప్ భార్య మెలానియా వ్యవహరిస్తున్న తీరు పెద్ద చర్చగా మారింది.  ఇటీవల ఇజ్రాయెల్‌ పర్యటనలో ట్రంప్‌ చేయి అందిస్తే మెలానియా విదిలించుకున్న తీరు కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.  ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయింది.  మెలానియాతో కలిసి రోమ్‌ చేరుకున్న ట్రంప్... విమానం ల్యాండ్‌ అవగానే.. ఇద్దరూ అభివాదం చేశారు. ఆ తర్వాత ట్రంప్‌ మెలానియా చేయి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే మెలానియా మాత్రం అదేమీ పట్టనట్లు చేతితో జుత్తు సవరించుకుంది. ఈ ఘటనతో ఇబ్బందిపడ్డ ట్రంప్‌ వెంటనే తన చేత్తో మెలానియా వెన్ను తట్టి సందర్భాన్ని కవర్‌ చేశారు. అయితే  మెలానియా ఇలా కావాలని చేశారో, లేదా యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు గానీ...ఇంకేముంది ఇప్పుడు ఇది కూడా కెమెరా కంటికి చిక్కి వైరల్‌గా మారింది. మరి మెలానియా ఇలా వ్యవహరించడానికి గల కారణాలు ఎంటబ్బా అని చర్చించుకుంటున్నారు.