వైసీపీ చేతిలో టీడీపీ డేటా.. కార్యకర్తలకు బెదిరింపులు
posted on Mar 5, 2019 1:49PM

టీడీపీ యాప్‌లో ఉన్న డేటా అంతా పోలీసుల ద్వారా టీఆర్ఎస్ తస్కరించి, వైసీపీకు అందజేసిందని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఆయన మీడియా ముందు బహిర్గతం చేశారు. గొల్లపూడికి చెందిన శీనునాయక్ అనే కార్యకర్తకు వైసీపీ కాల్ సెంటర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్‌ను మీడియా సమావేశంలో మంత్రి వినిపించారు. 040 38134078 అనే నెంబర్ వైసీపీ కాల్ సెంటర్‌కు చెందినదని.. ఆ నెంబర్ నుంచి అనేక మంది టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి మీ డేటా అంతా ఉందని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వైసీపీకి ఓటు వేయాలని హెచ్చరిస్తున్నారని కాల్ అందుకున్న టీడీపీ కార్యకర్త ఆరోపించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏపిలోనూ అదే తరహా కుట్రలను కేసీఆర్ ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఏపీలో తెలంగాణ తరహా కుట్రలను జగన్ కోసం కేసీఆర్ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థులను కేసీఆర్, బీజేపీ నిర్ణయిస్తున్నాయి. ఫామ్ హౌసుల్లో కూర్చొని రామ్ మాధవ్, కేసీఆర్ వైసీపీ ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు.’ అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో జగన్ కుమ్మక్కై ఏపీ పోలీసులపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. టీడీపీ యాప్ సేవామిత్రను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థపై ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ పోలీసులు దాడి చేసి డేటా అంతా సేకరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ సమాచారం మొత్తం వైసీపీకి చేరిపోయిందని, దానికి ఈ ఫోన్ కాల్సే సాక్ష్యమంటున్నారు.