జగన్ పార్టీలో అసంతృప్తి సెగలు?
posted on May 24, 2012 10:51AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని అసంతృప్తి సెగలు కారుమేఘాల్లా కమ్మేస్తున్నాయి. అసలు తమ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డిని కలవటానికి సాధ్యం కావటం లేదని కార్యకర్తలు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ప్రచారవేళల్లో మినహా మిగతా సమయంలో తమకు ప్రవేశం ఉండదని వారు అంటున్నారు. ప్రత్యేకించి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే జగన్ ను కలవాలంటే అసాధ్యమని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లాలోని తన స్వగ్రామంలో కార్యక్రమానికి తనను రానీయలేదని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అలిగారు. ఆయన తన సొంతజిల్లా ప్రకాశం పార్టీ ఇన్ ఛార్జిగా వెళ్ళాలని ఆశపడ్డారు. పార్టీ అధికార ప్రతినిధినైన తనకే అవకాశాలు ఇవ్వక పొతే, మిగతా వారి పరిస్థితి ఏమిటని ఆయన అలిగారు. ఎమ్మెల్యే అయినా ఎంత పెద్దవాడైనా జగన్ ను కలవటం కుదరదని, ఆయన ఇంటి ప్రదానగేటుకు, గుమ్మానికి మధ్యలో ఉండిపోవాల్సిందేనని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత (పేరు రాయొద్దని) తూర్పు గోదావరి జిల్లాలో చెప్పారు. అసలు గెలిచేపార్టీకి ఉండాల్సిన లక్షణాలే తమ అధినేతకు లేవన్న విమర్శలు వినిపించాయని ఆయన అంటున్నారు. అయితే మాస్ గేధరింగ్ బాగున్నందున తామంతా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో ఉండిపోతున్నామని, లక్షలు ఖర్చు పెట్టినా ఆ పార్టీని విడవలేమని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నియోజకవర్గానికి సమీపంలోని ఓ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే 'తెలుగువన్.కామ్' ఎదుట అంగీకరించారు.
అసంతృప్తి ఉన్నా అవకాశముందని సర్దుకుపోతామన్నారు. 2014 వరకూ అసంతృప్తి ఉన్నా పార్టీని ఏమీ చేయదని ఆయన చెప్పారు. ఇలా అసంతృప్తితోనే ఉన్న ఈ నేతలకు కొత్తగా ఓ సమాచారం అందింది.
అదేమిటంటే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరికీ వారె సొంతఖర్చులతో గెలవాలని దాని సారాంశం. దీంతో ఈ నేత కూడా డంగైపోయి ఇంకా జగన్ వెనుక ఉండి ఏమి ప్రయోజనమని తిరిగి ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సొంత ఖర్చుతో పార్టీ తరపున గెలవాలని ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలుసుకుని ఆ నట అసంతృప్తితో గుటకలు మింగారు. అలానే ఈ పార్టీకి వేదికలు కల్పించినవారూ, నేతలుగా ఉన్నవారూ కూడా అసంతృప్తిని బయటపడకుండా జాగ్రత్తగా నటిస్తున్నారని పరిశీలనలో తేలింది.