జమిలి ఎన్నికలపై మళ్ళీ చర్చ ..

కేంద్ర పభుత్వం జమిలి ఎన్నికల అంశాన్ని మరో మారు తెరమీదకు తెస్తోందా? ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, 2014లో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం అదే ప్రయత్నాలలో ఉందనేది  తెలిసిన విషయమే. అయితే, రాజకీయ సంక్లిష్టత నడుమ, ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయితే అందుకు అవసరమైన కసరత్తు మాత్రం ఆగలేదు.

మరో వంక కేంద్ర ఎన్నికల సంఘం మొదటి నుంచి జమిలి ఎన్నికల వైపే మొగ్గు చూపుతోంది. అలాగే, మేథావులు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు చాలా వరకు జమిలి ఎన్నికల విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారు. దేశంలో  సంవత్సరం పొడుగునా ఎక్కడో అక్కడ ఎన్నికలు జరగడం వలన ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు , పరిపాలన కుంటుపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జమిలి వైపు మెల్లగా అడుగులు వేస్తోందని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి, ఈ సంవత్సరం జులైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది, లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం లా కమిషనర్ పరిశీలనలో వుందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని కేంద్రం పేర్కొంది.  

జమిలి ఎన్నికలపై అనేక భాగస్వామ్య పక్షాలతోనూ చర్చించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  స్టాండింగ్ కమిటీ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని తెలిపింది. నివేదిక ఆధారంగా సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిందని పేర్కొంది. ఎనిమిదేళ్లలో రూ.7 వేల కోట్లకు పైగా ఎన్నికల వ్యయం అయ్యిందని కేంద్రం తెలిపింది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనను అటకెక్కించలేదనే విషయం స్పష్టమైంది.  స్టాండింగ్ కమిటీ నివేదికపై సాధ్యాసాద్యాలను పరిశీలింస్తోంది. మరో వంక రాజకీయ ఏకాభిప్రాయానికీ ప్రయత్నాలు సాగిస్తోంది.ఈ నేపధ్యంలో, లోక్‌సభకు, శాసనసభకు 2024లో ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి  అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సందర్భం ఏదైనా ఆయన సంకల్పం ఇంకేదైనా బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకే నాయకుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసివేయలేమని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో జమిలి ఎన్నికలు సాధ్యమా అంటే,  అవునని కానీ, కాదని కానీ, చెప్పే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. మరో వంక జమిలి ఎన్నికలు జరిగితే 2024లో జరుగుతాయా లేక అంతకు ముందుగానే,  2023లో తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా? అదే జరిగితే, రాన్నున్న ఐదారు నెలలో జరగనున్న గుజరాత్ సహా ఐదారు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేస్తారా? అప్పటికి ఐదేళ్ళ గడవు ముగియని రాష్ట్ర అసెంబ్లీల రద్దుకు ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నా తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు  ఒప్పుకుంటాయి? రాజ్యాంగ సవరణ అవసరం అనుకుంటే, అది సాధ్యమవుతుందా? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తునారు.

జమిలి ఎన్నికల వలన ఎవరికి ప్రయోజనం అనే చర్చకూడా జరుగుతోంది. సహజంగా, జమిలి ఎన్నికలు జరిగితే, ప్రాంతీయ పార్టీల కంటే, జాతీయ పార్టీలదే పై చేయి అవుతుంది. అందుకే ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలను ఎంతవరకు స్వాగతిస్తాయనేది సందేహమే అంటున్నారు. అయితే, తెరాస సహా మరి కొన్ని ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలకు సమ్మతి తెలియచేశాయి.  2018లో లా కమిషన్ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన సమయంలో  తెరాస  తరఫున ఆపార్టీ నేత, (అప్పటి ఎంపీ) వినోద్ కుమార్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బృందం లా కమిషన్‌ను కలిసి జమిలి ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా ఇది మోడీ ఆలోచన కాదని జమిలి ఎన్నికలపై 1983 నుంచి జాతీయ లా కమిషన్ చర్చిస్తోందని వినోద్ కుమార్ గుర్తు చేశారు.అలాగే అప్పట్లో మరి కొన్ని పార్టీలు కూడా సానుకులంగా స్పందించాయి.  అయితే దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో,ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత  ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ స్లోగన్ తెరపైకొచ్చిన నేపధ్యంలో  ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలకు ఆమోదించక పోవచ్చని అంటున్నారు.

అయితే,  బీజేపీ మాత్రం కేంద్రంలో హట్రిక్ సాధించేందుకు జమిలి తారక మంత్రం అవుతుందనే అభిప్రాయంతో ఉందని, కాబట్టి,  2024కు కాస్త ముందు వెనకా అయినా జమిలి ఎన్నికలకు వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే, అంతిమంగా ఏమి జరుగుతుందనేది ప్రస్తుతానికి అయితే... ప్రశ్నగానే ఉందని అంటున్నారు.