ఢిల్లీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులు

 

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని  దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యూపీలోని ఘజియాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్‌ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్‌ చేశాడని ఘజియాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. సంబంధిత సిమ్‌ కార్డు ఓ మహిళ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

నకిలీ ధ్రువపత్రాలతో ఆ సిమ్‌ కార్డు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భద్రతా వలయాన్ని పటిష్టం చేయడంతో, ఆమె బహిరంగ కార్యక్రమాలు, ప్రజలతో సమావేశాలపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ సీఎం తరుచుగా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. 2019లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ ఆటోరిక్షా డ్రైవర్ చెంపదెబ్బ కొట్టారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదనే కోపంతో ఆ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు, 2016లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కేజ్రీవాల్‌పై కొందరు నల్ల సిరా చల్లారు.