ఎవరి దారి వారిదే.. ఎవరి గోల వారిదే.. బీజేపీలో నయా ట్రెండ్!
posted on Aug 27, 2024 9:08AM
భారతీయ జనతా పార్టీ అంటే క్రమ శిక్షణ గల పార్టీ అన్న భావన అందరిలో ఉంటుంది. ఆ పార్టీలోని నేతలు ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు మాట్లాడేందుకు వీలుండదు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకొవాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తరహాలో బీజేపీలో నేతల మధ్య గ్రూపు రాజకీయాలు చాలా తక్కువగా ఉంటాయన్న అభిప్రాయం ఉండేది. తెలంగాణ బీజేపీలోనూ మొన్నటి వరకు అదే పరిస్థితి ఉండేది. కానీ, పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో నయా ట్రెండ్ కనిపిస్తోంది. పార్టీలోని నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ నేతలు తలోమాటా మాట్లాడుతున్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటోంది.
ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తోందా.. సమర్ధిస్తోందా అనే విషయం అర్థకాక ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైడ్రా విషయం లోనూ బీజేపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరి కొందరు నేతలు హైడ్రా తీరును తప్పుబట్టగా.. ఎంపీ రఘనధన్ రావు, బీజేపీ నేత కొండా విశ్వేశ్వ రరెడ్డి వంటి నేతలు హైడ్రా పనితీరును ప్రశంసిస్తున్నారు. తాజా పరిస్థితిని చూస్తే రాష్ట్ర బీజేపీలో వర్గపోరు తీవ్రస్థాయికి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. దీంతో పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో పరిణామాలపై దృష్టిసారించింది. రాష్ట్రంలో కొందరు నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు మంచి ఫలితాలను కట్టబెట్టారు. పదిహేడు ఎంపీ స్థానాలకుగాను ఎనిమిది స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీకి ఇది పెద్ద విజయమనే చెప్పొచ్చు. ఎన్నికల్లో సానుకూల ఫలితాలను సాధించి ఊపు మీదున్న బీజేపీ.. ఆ జోష్ ను ప్రస్తుతం కంటిన్యూ చేయలేకపోతోంది. నేతల మధ్య వర్గవిబేధాల కారణంగా పార్టీ శ్రేణులు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తరువాత కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్తవారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ తో పాటు మరి కొందరు నేతలు అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్నారు. అదే సమయంలో బీజేపీ వర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. కొందరు నేతలు పార్టీలైన్ దాటి తమ అభిప్రాయాలను ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీలోని ఒక్కోనేత ఒక్కోలా మాట్లాడుతుండటం బీజపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.
కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశాడు. అదే సమయంలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మేఘా సంస్థ తప్పిదాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అంతేకాక.. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలితే మీడియాను తీసుకెళ్లి మరీ చూపించి, కాంట్రాక్టు సంస్థ తప్పిదాలను ఎత్తిచూపారు. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేఘాకు అక్కడి ప్రభుత్వాలు పలు ప్రాజెక్టులు అప్పగించడంతో.. ముందుగా మేఘాపై బీజేపీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కమలనాథులు డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. తాజాగా రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా విషయంలోనూ బీజేపీ నేతలు ఏకాభిప్రాయంతో లేరు. ఎవరికి అభిప్రాయాన్ని వాళ్లు ఓపెన్‌గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేస్తున్నారు. హైడ్రా తీరును కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పుబట్టారు. దీంతో బీజేపీ హైడ్రాకు వ్యతిరేకమని అందరూ భావించారు. కానీ, ఎంపీ రఘునందన్ రావు ప్రెస్‌మీట్ పెట్టి హైడ్రా కూల్చివేతలను సమర్ధించాడు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మరికొందరు బీజేపీ నేతలు హైడ్రాను ఏర్పాటు చేయడం పట్ల రేవంత్ సర్కార్ ను అభినందించారు. ఇవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా పార్టీ అభిప్రాయంగానే చెప్పేశారు. దీంతో హైడ్రా విషయంలో అసలు బీజేపీ స్టాండ్ ఏమిటన్న చర్చ రాజకీయాల్లో మొదలైంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పార్టీ అధిష్టానం అనుమతి మేరకే పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టాలని ఆంక్షలు విధించినట్లు తెలిసింది.
తెలంగాణ బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ విషయంలో పార్టీలో గందరగోళం కొనసాగుతోందని సమా చారం. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ ను తానే అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రకటించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాన్ని ఖండించారు. అయితే కిషన్ రెడ్డి మాటలను లెక్కచేయకుండా తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి అభయ్ పాటిల్ హాజరయ్యారు. అంతేకాదు.. ఆగస్ట్ 17న ఢిల్లీలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్‌లో తెలం గాణ ఇంచార్జ్‌గా పాల్గొనట్టు అభయ్ పాటిల్ ట్వీట్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా తరుణ్‌చుగ్ వ్యవహరించారు. ఆయనను జమ్మూకశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్‌కే పరిమితం చేయడంతో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. అధికారికంగా ఈ పదవిలో పార్టీ అధిష్ఠానం ఇంకా ఎవరినీ నియమించ లేదు. కానీ జాతీయ నాయకత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందంటూ అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా తనను తానే స్వయంగా ప్రకటించుకున్నారు.
దీంతో కిషన్ రెడ్డితో సహా బీజేపీలో కొందరు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ నేతలు పలువురు అభయ్ పాటిల్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆయనొద్దని ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేసినట్లు సమాచారం. మొత్తానికి క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరున్న బీజేపీలో వర్గవిబేధాలు తార స్థాయికి చేరడంతో పాటు.. నేతలు ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుంటుండం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర పార్టీ పెద్దలు దృష్టిసారించారని, త్వరలోనే రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అన్ని సమస్యలకు ఎండ్‌కార్డ్ పడుతుందని ఆ పార్టీలోని కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది వేరే సంగతి. ప్రస్తుతం మాత్రం బీజేపీ రాష్ట్ర నేతల తీరుతో ఆ పార్టీ క్యాడర్ లో తీవ్ర గందరగోళం నెలకొందనడంలో మాత్రం సందేహం లేదు.