ఏపీకి గుడ్ న్యూస్.. 12 పారిశ్రామిక వాడల జాబితాలో ఏపీకి పెద్దపీట
posted on Aug 27, 2024 9:24AM
కేంద్రం ప్రభుత్వం ఏపీకి తీపి కబురు అందించనుంది. కేంద్రం పాతిక వేల కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా 12 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు జాబితాలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.
జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న 12 పారిశ్రామిక వాడల జాబితాలో బీహార్, ఆంధ్ర ప్రదేశ్, యూపీ, ఉత్తరాఖండ్, కేరళ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం ఒక్కటే తరువాయి అని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయంతో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక పురోగతిని గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ఈ కొత్త ప్రాజెక్టులు రూ.1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలవని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా గృహ, వాణిజ్య ప్రాంతాలతో కూడిన సగటు పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలవని విశ్వసిస్తోంది. ఈ పారిశ్రామిక పార్కుల ద్వారా దేశీయంగా తయారీని పెంచడం, ఉపాధిని సృష్టించడం సాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. సహజంగానే విజనరీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుందనడంలో సందేహం లేదు.