ధ‌ర్మ‌స్థ‌ల మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్

క‌ర్ణాట‌క‌లోని ధ‌ర్మ‌స్థ‌ల అంటే తెలియ‌ని వారుండ‌రు. కార‌ణం ఈ ప్రాంతంల‌తోని మంజునాథుడికి అంత‌టి విశేష‌మైన పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయి. ఒక‌ ర‌కంగా  చెప్పాలంటే ఇది క‌ర్ణాట‌క తిరుమ‌ల‌గా ప్రఖ్యాతి చెందింది. ఇక్క‌డ ఎప్ప‌టి నుంచో హెగ్డేల కుటుంబం వంశ‌పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త‌లుగా ఉంటూ వ‌స్తున్నారు. వీరి అధ్వ‌ర్యంలో ఇక్క‌డ   ధ‌ర్మం  నాలుగు పాదాలా నడుస్తుందన్న విశ్వాసం జనంలో మెండుగా ఉంది.

అలాంటి ధ‌ర్మ‌స్థ‌లలో 1995 నుంచి 2014 మ‌ధ్య అనుమానాస్ప‌దంగా కొంద‌రు మ‌హిళ‌లు, యువ‌తుల‌ మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌నీ,  అవి కూడా హింస‌, లైంగిక వేధింపుల‌కు సంబంధించిన‌వేననీ ఇక్క‌డ ప‌ని చేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు గ‌త జూలై 3న ఫిర్యాదు చేశాడు.  అంతే కాదు తాను గ‌తంలో పాతి  పెట్టిన ఒక మృత‌దేహం ఆన‌వాళ్లు సైతం తీసి ఆధారాలు చూపించాడు.

దీంతో ఈ కేసు ఇటు ధ‌ర్మ‌స్థ‌ల పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త‌లైన హెగ్డే కుటుంబం నుంచి..  అటు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వ‌ర‌కూ హ‌డ‌లెత్తేలా చేస్తోంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జ‌డ్జి గోపాల గౌడ క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను క‌ల‌సి  ఈ కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం  చేయాల‌ని కోరారు.  క‌ర్ణాట‌క మ‌హిళా క‌మిష‌న్ సైతం సీఎంకి ఈ కేసులో దోషులెవ‌రున్నా వదలకుండా శిక్షించాలని డిమాండ్  చేసింది.

అంతే కాదు గ‌తంలో అంటే 2003లో క‌నిపించ‌కుండా  పోయిన అన‌న్య భ‌ట్ కేసు, 2012లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సౌజ‌న్య కేసు.. ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. అంతే కాదు తన ఇంట్లోని ఒక మైన‌ర్ బాలిక‌పై ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురు కావ‌డంతో తాను 2014 లో ఇక్క‌డి నుంచి పారిపోయాన‌నీ అంటాడీ మాజీ స‌ఫాయి కార్మికుడు. 

ఆ మాట‌కొస్తే.. తన చేతుల మీదుగా ఎన్నో మృత‌దేహాల‌కు ఖ‌న‌నం, ద‌హ‌నం నిర్వ‌హించాన‌ని అంటాడీయ‌న‌. దీంతో మంగ‌ళూరు పోలీసులు జూలై 4న కేసు న‌మోదు చేశారు. అంతే ఫిర్యాదు చేసిన కార్మికులు  స్థానిక బెళ్తంగ‌డి  న్యాయ‌స్థానం ముందు హాజ‌రై వాంగ్మూలం కూడా ఇచ్చాడు.  2010లో స్కూల్ డ్రెస్సులోని బాలిక మృత‌దేహాన్ని కూడా ఇలాగే ఖ‌న‌నం చేసిన‌ట్టు చెప్పాడు. మృత‌దేహాలు వెంట‌నే కుళ్లిపోయేలా  నేత్రావ‌తి న‌ది ముందే పూడ్చిపెట్టిన‌ట్టు కూడా చెప్పాడు. 

ఇత‌డిచ్చిన వివ‌రాల ఆధారంగా ఒక యూట్యూబ‌ర్ ఒక సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌రించాడు. ఈ వీడియోని 50 ల‌క్ష‌ల మందికి పైగా చూడడంతో ఈ ధ‌ర్మ‌స్థ‌ళ మ‌ర‌ణాల మిస్ట‌రీ మ‌రింత‌గా వెలుగులోకి వ‌చ్చింది. అంతే కాదు ఈ కథనాన్ని వెలువరించిన యూట్యూబర్ పై కేసు కూడా నమోదైంది.  అయితే ఈ మ‌ర‌ణాల వెన‌కున్న నిందితుల‌ను తామేమీ కాపాడ్డం లేద‌ని.. సాక్షి చెప్పిన వివ‌రాలు త‌మ‌ను షాక్ కి గురి చేశాయ‌ని.. ఒక వేళ ఇదే నిజ‌మైతే ఈ మిస్ట‌రీ మ‌ర‌ణాల వెన‌క ఎవ‌రున్నా స‌రే వ‌ద‌ల‌క శిక్షిస్తామ‌ని..  క‌ర్ణాట‌క ఆరోగ్య మంత్రి గుండూరావు పేర్కొన్నారు. 

అయితే ధ‌ర్మ‌స్థ‌లలో చీమ చిటుక్కుమ‌న్నా రాజ్య స‌భ ఎంపీ కూడా అయిన వీరేంద్ర హెగ్డేకి తెలిసే జ‌రుగుతుంది. మ‌రి ఆయ‌న ఒక ఎంపీగా ఉండి కూడా ఈ మిస్టరీ మరణాల విషయంలో  ముమ్మ‌ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని పార్ల‌మెంటులో ఎందుకు నిన‌దించ‌డం లేదన్న‌దిప్పుడు స‌స్పెన్స్ గా మారింది. మ‌రి ఈ కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో తేలాల్సి ఉంది. ఎంతో మ‌హిమాన్వితుడైన ఆ మంజునాథుడు ఇప్పుడే ఈ కేసును ఎందుకు వెలికి తీశాడో కూడా తేలాల్సి ఉంది. కాగా ఈ మర్డర్ల మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu