గండం గట్టెక్కిన మంత్రి ధర్మాన

 

మంత్రి ధర్మాన ప్రసాదరావు చట్టూ బిగిసిన సీబీఐ ఉచ్చునుండి హైకోర్టు ఆయనకు ఈ రోజు విముక్తి కలిగించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను వెనకేసుకు రావడంతో సీబీఐ, కోర్టులో మెమో దాఖలు చేసింది. సీబీఐ కోర్టు ఆయనను ప్రాసిక్యూషన్‌ చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ తీర్పు ఇవ్వడంతో, ఆయన కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషను దాఖలు చేసారు. ఈ రోజు హైకోర్టు సీబీఐ కోర్టు ఇచ్చిన మెమోను కొట్టివేసింది. ప్రస్తుతానికి ధర్మాన గండం గట్టెక్కినట్లే! కానీ, ఆయనపై చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ ఆయనను అంత తేలికగా వదిలిపెట్టకపోవచ్చును. సీబీఐ ఒక వ్యక్తిపై నేరారోపణలు చేసిన తరువాత దానిని రుజువు చేయవలసిన బాద్యత దానిమీదే ఉంటుంది కనుక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే, ధర్మానకు కొంచెం వెసులుబాటు దొరికిందని భావించవచ్చును. ఆయన సీబీఐను ఇదే విధంగా మరికొంత కాలం నిలువరించగలిగితే ఒకసారి ఎన్నికల గంట మ్రోగితే ఇక ఆయన అవసరం ప్రభుత్వానికి చాలా ఉంటుంది కనుక, ఆయనపై ఈగ (సీబీఐ) కూడా వాలకుండా చూసుకొనే బాద్యత కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలే చూసుకొంటాయి. ధర్మాన కేసులో హైకోర్టు కూడా ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి నిరాకరించిది గనుక, ఇక చార్జ్ షీటులో కెక్కిన మంత్రులకు కూడా కొంచెం దైర్యం వస్తుంది. సీబీఐ తమకి కూడా సమన్లు జారీ చేస్తే, అప్పుడు ఏమిచేయాలనే విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు వారికొక మార్గం చూపించి పుణ్యం కట్టుకొన్నారు గనుక వారు కూడా అదేవిధంగా బయటపడోచ్చును. కానీ, సీబీఐ కూడా అందుకు తగిన వ్యుహంతోనే ఇకపై కేసులు నమోదు చేయవచ్చును.