ముక్కోటి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు
posted on Dec 30, 2025 7:57AM
.webp)
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలన్నీ భక్తజనకోటితో కిక్కిరిసిపోయాయి. దేవాలయాలతో వైకుంఠ ద్వార దర్శనాలకు అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి అంటే 12గంటలు దాటిన తరువాత నుంచీ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించారు. వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను ఉత్తర ద్వార దర్శనం ద్వారాదర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిచ్చారు.
అలాగే చిన్న తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన ద్వారకా తిరుమలలో ఈ తెల్లవారు జామునుంచే ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఐదున్నర నుంచి శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు అనుమతించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇక సింహాచలంలో శ్రీవరాహా లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రసిద్ధ ఆలయాలలోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దేవదేవుడిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు.
అదే విధంగా తెలంగాణలోని అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిట లాడు తున్నాయి. రాష్ట్రంలోని భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.