ఊహించని ట్విస్ట్.. చంద్రబాబుకి ఝలక్ ఇచ్చిన కోడెల

 

ఏపీ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆయన్ను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని టీడీపీ భావిస్తుండగా.. ఆయన మాత్రం అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది.

గతంలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోడెలకు ఆ ప్రాంతంపై మంచి పట్టు ఉంది. అయితే 2004, 2009 ఎన్నికల్లో పరాభవం ఎదురవడంతో ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికి మారారు. 2014లో స్తతెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ వేరే అభ్యర్థి వైపు చూస్తుంది. ఆ సీటును టీడీపీ నిలుపుకోవాలంటే.. కోడెలనే సరైన అభ్యర్థి అని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి సీటును త్యాగం చేయాల్సిందిగా కోడెలను పార్టీ కోరింది. అందుకు అంగీకరించిన కోడెల.. దీనికి బదులుగా తన కుమారుడికి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టారు. కోడెల ప్రతిపాదనకు ఓకె చెప్పిన చంద్రబాబు.. నరసరావుపేట ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని చెప్పారు. దీంతో నరసరావుపేట నుంచి ఎంపీగా కోడెల పోటీ దాదాపు ఖాయమైపోయిందని అంతా భావించారు.

అయితే తాజాగా కోడెల తాజాగా చంద్రబాబుకి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ రాజకీయాలు తనకు సరిపడవని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దంగా లేనన్న సంకేతాలు ఇచ్చినట్టయింది. ఎంపీగా పోటీకి నిన్న మొన్నటిదాకా సుముఖంగానే ఉన్నట్టు కనిపించిన కోడెల.. ఉన్నట్టుండి మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. మరి కోడెలకు టీడీపీ నచ్చజెప్పుతుందా..? లేక మరోసారి సత్తెనపల్లి టిక్కెట్‌నే కేటాయిస్తుందా? చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu