మావల్ల కావడం లేదు.. ఏదైనా చేయండి! కరోనాపై ప్రధానికి సీఎం లేఖ 

దేశంలో కరోనా విలయతాండవంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పూర్తిగా అదుపు తప్పింది. రోజూ వేలాది కొత్త కేసులు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేక చేతులెత్తేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఢిల్లీలో పరిస్థితి పూర్తిగా విషమించింది. రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. డాక్టర్లు ఏమి చేయలేకపోతున్నారు. దీంతో

ఢిల్లీలో కరోనా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆక్సిజన్ కొరత వేధిస్తోందని అందులో ప్రస్తావించారు. దాదాపు ఐసీయూ బెడ్స్ అన్నీ నిండిపోయాయని చెప్పారు. అయినా సరే, తమ ప్రయత్నంలో తాము ఉన్నామని, కేంద్రం మద్దతు కూడా కావాలాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆస్పత్రుల్లో 10,000 పడకలున్నాయి. అయితే 1800 పడకలను కోవిడ్ కోసమే రిజర్వ్ చేసి ఉంచాం. ఢిల్లీలో కరోనా ఘోరంగా ఉంది. అందుకే కరోనా కోసం 7000 పడకలను రిజర్వ్ చేయాలి. ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఢిల్లీలోని డీఆర్డీవోలో ఐసీయూకు సంబంధించి 500 బెడ్లను తయారు చేస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. అయితే మరో 500 పడకలను కూడా తయారు చేయిస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకూ మాకు కేంద్ర సహకారం పూర్తిగా అందుతోంది. మరిన్ని విషయాలపై కూడా మీరు మాకు సహాయం చేయాలని ఆశిస్తున్నాం’’ అంటూ ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు.

మరోవైపు కరోనాతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండటంపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కొన్ని సలహాలు ఇచ్చారు మన్మోహన్ సింగ్. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. రాబోయే ఆరు నెలల్లో టీకాలు ఎందరికి ఇవ్వాలో నిర్దేశించుకుని, అందుకు తగినట్లుగా టీకా తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. వివిధ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్లకు ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్డర్ల వివరాలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. 

రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ను ఏ పద్ధతిలో పంపిణీ చేస్తారో పారదర్శకంగా ప్రకటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం కేంద్ర ప్రభుత్వం  10 శాతం వ్యాక్సిన్లను ఉంచుకోవచ్చునని, మిగిలిన టీకాలను రాష్ట్రాలు తమకు తగిన ప్రణాళిక ప్రకారం వాడుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. కోవిడ్-19పై ముందు వరుసలో ఉండి పోరాడుతున్నవారిని వర్గీకరించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని తెలిపారు. 45 ఏళ్ళ వయసు లోపువారికి కూడా అవసరమైతే వ్యాక్సినేషన్ చేయడానికి రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలన్నారు. దీనికి ఉదాహరణను కూడా మన్మోహన్ సింగ్ వివరించారు. అదేమిటంటే, పాఠశాల ఉపాధ్యాయులు, బస్సులు, త్రిచక్ర వాహనాలు, ట్యాక్సీల డ్రైవర్లు, పంచాయతీ సిబ్బంది, కోర్టులకు వెళ్ళే న్యాయవాదులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించవచ్చునని, వారి వయసు 45 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, వారికి టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చునని తెలిపారు.