అసలు డేటా చోరీకి అవకాశమే లేదు.. ఆ వార్తలు నమ్మొద్దు
posted on Mar 6, 2019 10:04AM

ఏపీ ఓటర్ల డేటా లీకేజీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటాను టీడీపీ చోరీ చేసి ప్రైవేట్ కంపెనీల చేతిలో పెట్టిందని వైసీపీ, టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. తప్పులు కేసులు పెట్టి, పోలీసులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్, వైసీపీ కలిసి టీడీపీ కార్యకర్తల డేటాను చోరీ చేశాయని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే ఈ వ్యవహారంపై ఐటీ శాఖ తరపున వివరణ ఇచ్చేందుకు ఏపీ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీకి చెందిన ఓటర్ల వ్యక్తిగత సమాచారం లీకేజికి గురయ్యే అవకాశమే లేదని.. డాటా లీకేజీపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు.
ఆధార్ డేటా చోరీకి గురయ్యేందుకు ఆస్కారమే లేదన్నారు. ఆ డేటా అంతా పూర్తిస్థాయిలో భద్రంగా ఉందన్నారు. అలాగే ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారం మొత్తం కూడా భద్రంగానే వుందని తెలిపారు. ఈ సమాచారాన్ని కొన్ని ప్రభుత్వ శాఖలకు మాత్రమే అందిస్తామని వివరించారు. తాము సేకరించచిన డేటా బేస్ ఆధారంగానే ఏపీలో 26 లక్షల కొత్త రేషన్ కార్డులు, 4 లక్షలకు పైగా నిరుద్యోగ భృతి, తిత్లీ బాధిత రైతులకు నష్టపరిహారం, 95 లక్షలకు పైగా మహిళలకు పసుపు-కుంకుమ పంపిణీ, 54 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పూర్తిస్థాయి భద్రతతో కూడిన డేటా బేస్ కావడం వలనే ఇంత భారీ స్థాయిలో లబ్ధిదారులకు సేవలు అందించగలిగామని అన్నారు. ఫిర్యాదుల నిమిత్తం 1100కు వచ్చే ఫోన్ కాల్స్ డేటా కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లే అవకాశమే లేదు. ప్రభుత్వ శాఖలకు కూడా ఆ డేటాను ఇవ్వడం లేదని విజయానంద్ స్పష్టం చేశారు.