బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్‌? దామోదర గొంతెమ్మ కోర్కెలు... అవాక్కయిన కమలం పెద్దలు!

 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహను బీజేపీలోకి రప్పించాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయనే టాక్‌ వినిపిస్తోంది. కేసీఆర్‌ సొంత జిల్లా ఉమ్మడి మెదక్‌లో పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు గాలమేసిన కమలం నేతలు... ముందుగా రాజనర్సింహతో చర్చలు జరిపారు. అయితే అప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం తీరుతో అసంతృప్తితో ఉన్న దామోదర... బీజేపీ నేతల దగ్గర తన కోర్కెల చిట్టా విప్పారట. తనకు ఆంథోల్‌‌ సీటుతోపాటు తన సతీమణికి సంగారెడ్డి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు జిల్లాలో మరో 6 సీట్లలో తాను చెప్పిన వారికే  టికెట్లు ఇవ్వాలని షరతు పెట్టారట. పైగా తనకు అవసరమైన అర్ధబలం సమకూర్చడంతోపాటు... కేంద్ర పనులకు సంబంధించిన కాంట్రాక్టు పనులూ ఇప్పించాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరారట.

 

దామోదర రాజనర్సింహ కోర్కెల చిట్టా, షరతులు విన్న రాష్ట్ర బీజేపీ నేతలు అవాక్కయ్యారట. తనకూ, ఆయన భార్యకు టికెట్లు కోరడంలో తప్పులేదని, కానీ జిల్లాలోని 12 సీట్లలో 8 టికెట్లను తాను చెప్పిన వారికే ఇవ్వాలనడంతో కంగుతిన్నారట. 12 సీట్లలో ఎనిమిదింటిని దామోదరకు ఆ‍యన వర్గానికే కట్టబెడితే... ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న నేతల పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారట. దాంతో దామోదరకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే... మీ డిమాండ్లను పార్టీ హైకమాండ్‌కి చెబుతామంటూ వచ్చేశారని తెలుస్తోంది. అంతేకాదు రాజనర్సింహ డిమాండ్లను ఒప్పుకుంటే... అసలుకే మోసం వస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారట. అదేదో పాత కాపులనే ఎంకరేజ్‌ చేస్తే... పార్టీ గెలుపు కోసం మరింత కష్టపని చేస్తారని... ఆ కాంట్రాక్టులేవో వాళ్లకే ఇప్పించడం మంచిదని డిసైడ్‌ అయ్యారట.

 

దామోదర గొంతెమ్మ కోర్కెలు విన్న కమలం నేతలు... మళ్లీ కలుద్దామంటూ చెప్పేసి వచ్చేశారట. దాంతో రాజనర్సింహ చేరిక ఇప్పట్లో లేనట్లేనని తేలిపోయింది. మొత్తానికి దామోదరను ఉపయోగించుకుని కేసీఆర్‌ సొంత జిల్లాలో బలపడతామనుకున్న బీజేపీ ఎత్తుగడ మొదట్లోనే బెడిసికొట్టింది.