శిరీషది ఆత్మహత్యే...ఆరోజు ఏం జరిగిందంటే..?

 

హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆత్మహత్య నగరంలో సంచలనం సృష్టించింది. ఇక దీనికి తోడు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు.. శిరీష ఆత్మహత్యకు మధ్య లింక్ ఉన్నట్టు వార్తలు రావడంతో ఈ కేసు ఇంకా కీలకంగా మారింది. అయితే ఎస్సై ప్రభాకర్ రెడ్డి శిరీషపై లైంగిక వేధింపులకు పాల్పడడ్డాడని.. అందుకే శిరీష ఆత్మహత్య చేసుకుందని... ఇది తెలిసి తన పరువు పోతుందన్న భయంతోనే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పుకార్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శిరీషది హత్యా..? లేక ఆత్మహత్యా..? అని పోలీసులు దర్యాప్తు చేసి అసలు ఏం జరిగిందో వెల్లడించారు. బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యేనని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈకేసులో నిందితులుగా ఉన్న రాజీవ్‌ కుమార్‌, శ్రావణ్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా.. విచారణలో వెల్లడైన పూర్తి వివరాలను సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

 

అసలు ఆరోజు ఏం జరిగిందంటే..

 

‘విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్‌ కుమార్‌  హైదరాబాద్‌లో ఆర్‌జే ఫోటోగ్రఫీ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అదే స్టూడియోలో ‘పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన విజయలక్ష్మి అలియాస్‌ శిరీష మేకప్‌ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. శిరీషకు 13ఏళ్ల క్రితం సతీశ్‌ చంద్ర అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 12ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే స్టూడియోలో నాలుగేళ్లుగా పనిచేస్తున్న శిరీషకు రాజీవ్ కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే రాజీవ్ కు తేజస్వీ అనే మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే శిరీష, రాజీవ్ ల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్న తేజస్వీ అతని ఆఫీస్ కు వెళ్లి తరచూ గొడవపడుతూ ఉండేది. అదే సమయంలో శిరీష కూడా రాజీవ్‌ తనను దూరం చేస్తున్నాడని భావించింది. దీంతో శిరీష-తేజస్విని మధ్య గొడవ జరిగి, అదికాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది.  అనంతరం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు.  పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శిరీష తనకు తెలిసిన శ్రావణ్‌కుమార్‌ను సంప్రదించింది. దీంతో శ్రావణ్ రాజీవ్‌, శిరీషల సమస్య పరిష్కారానికి ఇద్దరినీ జూన్‌ 12న తనకు తెలిసిన కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి తీసుకెళ్లాడు.  రాత్రి 11.30 గంటలకు కుకునూర్‌పల్లికి కారులో బయలుదేరి వెళ్లేటప్పుడు తమతో మద్యాన్ని తీసుకు వెళ్లారు. నలుగురూ కలిసి మద్యం తాగిన తర్వాత ఎస్‌ఐ, రాజీవ్‌, శ్రవణ్‌ కొద్దిసేపు బయటకు వెళ్లారు.  రాజీవ్‌, శ్రావణ్‌లను ఎస్ఐ ప్రాసిక్యూషన్‌ డెన్‌ వద్దకు వెళ్లమని చెప్పి తాను శిరీష దగ్గరకు వెళ్లాడు. అయితే ఎస్ఐ లోపలికి వెళ్లిన వెంటనే శిరీష గట్టిగా కేకలు వేస్తూ అరవడంతో.. రాజీవ్‌, శ్రావణ్‌ లోపలకు వచ్చారు. వాళ్లు వచ్చేసరికి ఓ పక్కన భయంభయంగా వణికిపోతూ కనిపించింది.  ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి నేనేమీ చేయలేదు కదా. కంగారు పడకు అని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా శిరీష అరవడం మానకపోవడంతో రాజీవ్‌ చెంపపై కొట్టాడు. గొడవ ఇంకా పెరుగుతుండగా ఎస్‌ఐ సలహా మేరకు రాజీవ్‌, శ్రవణ్‌ ఆమెను కారులో ఎక్కించుకుని బయలుదేరారు. ఇక కారులో వెళుతున్నప్పుడు కూడా శిరీష కారు డోర్‌ ఓపెన్‌ చేసి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో వారిద్దరూ శిరీషను పట్టుకునే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. ఇక ముగ్గురూ షేక్‌పేట్‌కు చేరుకున్న వెంటనే శిరీష నేరుగా ఫొటోగ్రఫీ కార్యాలయంలోని గదిలోకి వెళ్లిపోయింది. రాజీవ్‌, శ్రవణ్‌ కిందే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ పైకి వెళ్లి డోర్‌ కొట్టగా శిరీష తీయలేదు. దాంతో శ్రావణ్ వెళ్లిపోయాడు. తర్వాత ఫ్లాట్‌కు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేయగా శిరీష ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇక ఏంచేయాలో తెలియని రాజీవ్ కత్తితో చున్నీ కట్‌ చేసి మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టాడు. ఫోన్ చేసి శ్రవణ్ కు జరిగిన విషయం చెప్పగా.. శ్రవణ్‌ తిరిగి రావడంతో ఇద్దరూ కలిసి శిరీషను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారని మహేందర్ రెడ్డి చెప్పారు. అక ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డిది ఆత్మహత్యలేనని ఆయన తెలిపారు.