కాంగ్రెస్ లోనే నెగ్గుకు రాలేనివాడు తెరాసలో నెగ్గగలడా?

 

మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇంతకాలం తనకు ఎంతో గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి తెరాస కండువా కప్పుకోవడానికి సిద్దమయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి తొమ్మిదిసార్లు ఎన్నికలలో పోటీకి అవకాశం ఇస్తే కేవలం మూడు సార్లే గెలిచారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు పార్టీ అన్ని అవకాశాలు కల్పించినా ఆయన వాటిని వినియోగించుకొని తన సత్తా నిరూపించుకోలేక చతికిలపడ్డారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పడం హాస్యాస్పదం.

 

అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని తన సత్తాని నిరూపించుకోలేకపోయిన డి.శ్రీనివాస్ తెరాసలో చేరినెగ్గుకు రాగలరా? ఆయన చేరికతో తెరాస ఏమయినా బలపడుతుందా? అంటే రాజకీయ దురందరుడయిన కేసీఆర్ అటువంటి వెర్రి భ్రమలో ఉంటారని అనుకోలేము. డి.శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలకు మంచి పదవులు ఆఫర్ చేసి ఏదోవిధంగా తెరాసలోకి ఆకర్షించగలిగితే అది చూసి కాంగ్రెస్, తెదేపా పార్టీలలో సీనియర్, జూనియర్ నేతలు కూడా తెరాసలో చేరేందుకు సిద్దపడతారని కేసీఆర్ భావిస్తుండవచ్చును. ఆ విధంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలను బలహీనపరచాలనేది ఆయన వ్యూహం కావచ్చును. కానీ పార్టీలోకి కొత్తగా వచ్చిన అటువంటి వ్యక్తి కోసం పార్టీని నమ్ముకొన్న వారిని పక్కనబెట్టి ఆయనకు రాజ్యసభ సీటో లేక ఎమ్మెల్సీ సీటో కట్టబెడితే పార్టీలో అసంతృప్తి మొదలవదా? మొదలయితే ఆ సమస్యని ఏవిధంగా ఎదుర్కోవాలి? అనే ప్రశ్నలకు వలసలను ప్రోత్సహిస్తున్న తెరాస అధ్యక్షుడు కేసేఆరే సమాధానం కనుగొనవలసి ఉంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu