ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు.. నెలాఖ‌రు వ‌ర‌కు ఆంక్ష‌లు..

అనుకున్న‌ట్టే అయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్ఫ్యూ పొడిగించారు. ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష అనంతరం కర్ఫ్యూ పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఏపీలో క‌ర్ఫ్యూ విధించి 10 రోజులే అయింద‌ని.. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని.. క‌ర్ఫ్యూ 4 వారాలు ఉంటేనే స‌రైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని సీఎం జ‌గ‌న్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. 

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. పిల్లలకు ఆర్థికసాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. 

రెండు గంట‌ల‌కు పైగా జ‌రిగిన‌ ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో క‌ర్ఫ్యూ పొడ‌గింపుపై నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై కమిటీ ప్రధానంగా చర్చ జరిగింది. కాగా.. ఏపీలో రేపటితో కర్ఫ్యూ ముగియనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు వచ్చినప్పటికీ.. కర్ఫ్యూ స‌మ‌యాన్ని య‌ధావిధిగా నెలాఖరు వరకు పొడిగించింది ప్రభుత్వం.